అనురాధ హత్యలో మరో వ్యక్తి 'కసి': చింటూ ఫ్యామిలీ కోసం అన్నీ కోల్పోతే!
చిత్తూరు: ఏపీలోని చిత్తూరు నగర మేయర్ కటారి అనురాధ దంపతుల జంట హత్యల కేసు విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. హత్య జరగడానికి కారణాలు ఇవీ అంటూ పలు అంశాలు వెలుగు చూస్తున్నాయి. అయితే, ఏమిటనే విషయమై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
ప్రధానంగా హంతకులు ప్రతీకారం తీర్చుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మేయర్ దంపతుల హత్య వెనుక మోహన్ మేనల్లుడు చింటూనే ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నప్పటికీ, మరో పేరు కూడా వినిపిస్తోందని తెలుస్తోంది. మేయర్ భర్త మోహన్‌ను చంపడానికి వెంకటాచలపతి కూడా మరో సూత్రధారిగా కావొచ్చంటున్నారు.
Photos: అనురాధ అంతిమయాత్ర
వెంకటాచలపతి గత కొంత కాలంగా కసితో రగిలిపోతున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసిందని తెలుస్తోంది. చింటూ, వెంకటాచలపతి ప్రతీకారానికి 2007వ సంవత్సరంలో జరిగిన కొన్ని పరిణామాలే కారణంగా తెలుస్తోంది.2005లో కౌన్సిలర్ పదవికి పోటీ చేసిన కటారి మోహన్‌కు పోటీ నుంచి తప్పుకోవాలని ఓ వర్గం నుంచి బెదిరింపు రాగా, ఆఖరుకు హత్యాయత్నం కూడా జరిగింది.

ప్రాణాలతో బయటపడిన మోహన్ ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మేనమామకు అండగా నిలబడాలని, ఓ బలమైన ప్రత్యర్థిని ఎదురించాలని చింటూ ముందుకొచ్చినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అలా వచ్చిన చింటూ కర్ణాటక ముళబాగల్‌లో నేర చరిత్ర ఉన్న సతీష్, ప్రకాష్ అనే వారితో పరిచయాలను నెరిపారు.
వెంకటాచలపతి కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తూ.. సతీష్, ప్రకాష్‌కు అనుచరుడిగా వ్యవహరిస్తూ చింటూకు సహకరించాడు. 2007వ సంవత్సరంలో మామ కోసం హత్యాకాండను సృష్టించాలని భావించిన చింటూ ముల్‌బాగల్‌లో పథకం రచించేవాడని పోలీసుల విచారణలో తెలిసిందని సమాచారం.
ఆ సమయంలో వెంకటాచలపతి కూడా చింటూకు సహకరించినట్లుగా తెలుస్తోంది. 2007లో చిత్తూరులో సీకే బాబుపై జరిగిన హత్యాయత్నం కేసులో వెంకటాచలపతి నిందితుడుగా ఉన్నారని సమాచారం. దీంతో వెంకటాచలపతి ఉద్యోగం పోగా, భార్యాపిల్లలు దూరమయ్యారు.

వెంకటాచలపతిని ఆదుకుంటామని అప్పట్లో కటారి మోహన్ భరోసా ఇచ్చారని, ఆ తర్వాత పట్టించుకోలేదని సమాచారం. దీనిపై ఇటీవల కటారిని కలిసి సాయం చేయాలని అడిగితే, స్పందించకపోవడంతో కసి పెంచుకుని, దారుణానికి తెగించినట్లు వార్తలు వస్తున్నాయి.
మేయర్ దంపతులకు ప్రధాన అనుచరుడిగా ఉన్న ఓ యువ కార్పోరేటర్‌ను కూడా చంపాలని భావించినా, సమయం లేక వెళ్లిపోయారని తెలుస్తోంది. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఉన్నారు. చింటూ, అతనికి సహాయకుడిగా ఉన్న వెంకటేష్ పట్టుబడితే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయంటున్నారు.
కాగా, మేయర్ అనురాధ దంపతులకు నగర ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. స్థానిక గంగనపల్లిలోని మేయర్ స్వగృహంలో ఉంచిన కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ భౌతికకాయాలను కడసారి చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు, నగర ప్రజలు గంగనపల్లికి తరలివచ్చారు.
గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు మేయర్ దంపతుల భౌతిక కాయాలను ప్రత్యేకంగా అలంకరించిన మినీవ్యాన్‌లో స్వగృహం నుంచి సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రం వరకు ఒరేగింపుగా తీసుకువెళ్లి అంత్యక్రియలు జరిపారు.
చింటూ ఆచూకీ తెలిపితే రూ.లక్ష రివార్డు
చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చింటూ ఆచూకీ కోసం పోలీసులు తీవ్ర గాలింపు చేస్తున్నారు. ఈ క్రమంలో అతని గురించి తెలిపిన వారికి రూ.లక్ష రివార్డు
అందజేస్తామని డీజీ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు.
ఈ కేసులో ప్రత్యేక అధికారిగా రాయలసీమ రేంజ్ ఆర్పీ ఠాకూర్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలో ఇవాళ హత్య జరిగిన కార్పొరేషన్ కార్యాలయాన్ని ఉన్నతాధికారులతో కలసి ఆయన పరిశీలించారు. అనంతరం మేయర్ నివాసానికి వెళ్లారు. మరోవైపు చింటు పోలీసులకు లొంగిపోయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications