ప్రత్యేక నిధులు ఇచ్చినా చాలు: జెసి, పట్టిసీమ గుట్టు అదేనన్న ఉండవల్లి
కర్నూలు/ రాజమండ్రి: కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక నిధులు ఇచ్చినా రాష్ర్టాభివృద్ధి సాధ్యమేనని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి చెప్పారు. రాష్ర్టానికి ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాగా కృషి చేస్తున్నారని చెప్పారు. రాజధాని నిర్మాణం ఒక్కరోజులో పూర్తి అయ్యేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదనే విషయాన్ని జెసి దివాకర్ రెడ్డి మొదటి నుంచీ చెబుతూ ఉన్నారు.

ఇదిలావుంటే, పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును ఆపేందుకే పట్టిసీమ ప్రాజెక్టును చంద్రబాబు ముందుకు తెచ్చారని ఆయన విమర్శించారు.
శనివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్టు ఓ బోగస్ అని వ్యాఖ్యానించారు. పట్టిసీమలోరూ.492 కోట్ల అవినీతి జరిగిందన్నారు. సుప్రీం కోర్టు ద్వారా పోలవరం ప్రాజెక్టకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు నరేంద్ర మోడీ, చంద్రబాబు కుట్రపన్నుతున్నారని ఆయన ఆరోపించారు. పట్టిసీమపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు.
పట్టిసీమ అక్రమాలపై ఆరోపణలు చేస్తే ఎందుకు సమాధానం చెప్పడం లేదని ఆయన అడిగారు. కృష్ణాగోదావరుల అనుసంధానం జరగలేదని ఆయన అన్నారు. చెంబులతో నీళ్లు పోసి జరిగిపోయిందంటే ఎలా అని అడిగారు. బకింగ్‌హాం కాల్వ సమయంలోనే కాల్వల ఉనుసంధానం ఉండేదని ఆయన చెప్పారు.
వెలలేరు వద్ద 350 ఎకరాల చెరువును పూడ్చి పెట్టి ఆగమేఘాల మీద కాల్వ తవ్వేశారని ఆయన ఆరోపించారు. ఒడిశాను మంచి చేసుకోవడానికే పోలవరం ప్రాజెక్టును ఆపారా అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications