హోదాపై టార్గెట్ వెంకయ్య, బాబుపై ఊగిపోయాడు, పవన్ కళ్యాణ్ రివర్స్!
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్ర్తత్యేక హోదా విషయమై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులను టార్గెట్ చేసుకుంటున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్, నటుడు శివాజీ, ప్రత్యేక హోదా కోరుకుంటున్న పలు సంఘాలు వారిని టార్గెట్ చేస్తున్నాయి.
విభజనకు ముందు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు. ఇప్పుడు ఇదే అంశాన్ని విపక్షాలు లేవనెత్తుతున్నాయి. అప్పుడు పదేళ్లని, ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారని ప్రశ్నించారు.
అదే సమయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కూడా టార్గెట్ చేసుకుంటున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనని కేంద్రం చెబుతుంటే, ఇంకా ఎందుకు మోడీ మంత్రివర్గంలో కొనసాగుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
ప్రత్యేక హోదా కోసం జగన్ త్వరలో ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారు. నటుడు శివాజీ ఇప్పటికే చంద్రబాబు, కేంద్రం, వెంకయ్య నాయుడులను నిలదీస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం వివిధ సంఘాలు ఏకమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ హోదా కోసం టిడిపి ఎంపీలను, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆయన బిజెపి పైన ఇప్పటి వరకు అంత ఘాటుగా స్పందించలేదనే చెప్పవచ్చు.

బుధవారం నాడు వెంకయ్య, చంద్రబాబుల పైన సినీ నటుడు శివాజీ మండిపడ్డారు. వెంకయ్య పైన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య ఎక్కడి నుంచి పోటీ చేసినా 7, 8వేల ఓట్లు రావని ధ్వజమెత్తారు. వెంకయ్య నాయుడు రాజకీయ పబ్బం గడుపుకునేందుకు కేంద్రాన్ని, బిజెపిని మోసం చేస్తున్నారన్నారు.
ప్రత్యేక హోదా కోసం గతంలో రాజ్యసభలో పోరాడిన వెంకయ్య ఇప్పుడు అవసరం లేదంటున్నారని ధ్వజమెత్తారు. ఇది న్యాయమా అన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులు ఎవరికి కావాలన్నారు. డబ్బు తమ దగ్గర కూడా ఉందని, ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు వస్తాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
శివాజీ చంద్రబాబు పైన కూడా మండిపడ్డారు. ఏపీలో అవీనీతి పెచ్చరిల్లుతోందన్నారు. ఏపీలో సొంత రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొస్తే లంచాలు అడుగుతున్నారని ఆరోపించారు. సొంత రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు లంచాలెందుకివ్వాలన్నారు.
అన్ని రంగాల్లో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. ప్రతిపక్ష వైసీపీపైనా ఆయన నిప్పులు చెరిగారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రెండు పార్టీల ఎంపీలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. పార్లమెంటులో హోదా కోసం చేస్తున్న ఆందోళనల్లో చిత్తశుద్ధిగా పాలుపంచుకుంటున్నారా? అని నిలదీశారు.












Click it and Unblock the Notifications