టిడిపి పొత్తు: టిలో బిజెపికి 45, సీట్లపై కుదరని లెక్క
వరంగల్/హైదరాబాద్: భారతీయ జనతా పార్టీతో తెలంగాణలో తమ పార్టీ పొత్తు కుదిరిందని తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు బుధవారం చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో బిజెపికి తాము 45 స్థానాలను కేటాయించేందుకు సిద్ధమయ్యామన్నారు. సీట్ల సర్దుబాటు ఇంకా కావాల్సి ఉందని చెప్పారు.
పొత్తులతో తమ పార్టీలోని ఆశావహులు కొంత నిరుత్సాహపడ్డారన్నారు. ఎవరు నిరాశ పడవద్దని, నేతలకు సముచిత న్యాయం చేస్తామన్నారు. బిజెపితో పొత్తుకు సంబంధించిన సమాచారాన్ని రెండు రోజుల్లో విడుదల చేస్తామన్నారు. తెలంగాణకు అసలైన ద్రోహి తెరాస మాత్రమే అన్నారు.

పొత్తు, సీట్లపై సందిగ్ధత
మరోవైపు సీమాంధ్రలో బిజెపి, టిడిపి పొత్తుపై సందిగ్దత నెలకొంది. ప్రధానంగా సీమాంధ్రలో బిజెపి 28 అసెంబ్లీ, 8 లోకసభ సీట్లు కోరుతూ టిడిపికి జాబితాను అందజేసిన సీమాంధ్ర బిజెపి అందులో కనీసం 20 అసెంబ్లీ, 6 లోకసభ స్థానాలకు ఆ పార్టీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే టిడిపి మాత్రం 15 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాలు ఇస్తామని బిజెపికి స్పష్టం చేసినట్లు సమాచారం.
15 సీట్లలో కూడా బిజెపి ఇచ్చిన జాబితా నుంచి 10 అసెంబ్లీ స్థానాలు, తాము సూచించిన మరో ఐటు సీట్లను తీసుకోవాలని బిజెపికి సీమాంధ్ర టిడిపి స్పష్టం చేసింది. అయితే, ఈ వ్యవహారంపై బిజెపి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో టిడిపి నేతలు చర్చలు ముగించి హైదరాబాద్‌కు బయలుదేరారు.
దీంతో తదుపరి చర్చలు సీమాంధ్ర బిజెపి శాఖతో మాట్లాడి సీట్ల సర్దుబాటు చేయాలని ప్రకాశ్ జవదేకర్‌కు బిజెపి అగ్రనేత అరుణ్ జైట్లీ సూచించినట్లు తెలుస్తోంది. ఈరోజు లేదా రేపు జవదేకర్ హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది. సీమాంధ్ర బిజెపి శాఖతో చర్చించి టిడిపి ప్రతిపాదనలపై ఓ నిర్ణయానికి రానున్నారు.












Click it and Unblock the Notifications