చంద్రబాబుకు బెయిల్: టీడీపీ సంబరాలు; బాబును ఏ శక్తీ ఆపలేదన్న అచ్చెన్న!!
53 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది. గత యాభై మూడు రోజులుగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా ఏపీ హైకోర్టు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి పోయాయి.
చంద్రబాబుకు బెయిల్ రావడంతో హిందూపురంలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకుంటున్నారు. రోడ్లపైకి వచ్చిన తెలుగు తమ్ముళ్లు బాణాసంచా కాలుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు మళ్ళీ వచ్చాడని, బాబు ఈజ్ బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇక రాజమండ్రి లోను చంద్రబాబుకు బెయిల్ లభించడంతో సంబరాలు అంబరాన్ని తాకాయి. టిడిపి శ్రేణులు భారీగా బాణసంచా కాల్చి, చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ కార్యాలయం ముందు కూడా తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకున్నారు. తెలుగు ప్రజలు కోరుకున్నట్టు నిజమే గెలిచిందని, కోట్లాది ప్రజల ప్రార్థనలు ఫలించి చంద్రబాబు గారు బయటకు వచ్చారంటూ టిడిపి శ్రేణులు బాణసంచా కాలుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించుకుంటున్నాయి. ఇదిలా ఉంటే చంద్రబాబుపై పెట్టిన ఏ అక్రమ కేసూ నిలబడదని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. జైలు నుంచి బయటకు చంద్రబాబు కాలుపెట్టిన సమయం నుంచి జగన్ పతనం ప్రారంభమవుతుందని ఆయన హెచ్చరించారు.
చంద్రబాబు తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ తప్పు చేయలేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు . మహానుభావుడు చంద్రబాబును దుర్మార్గుడు జగన్ జైల్లో పెట్టించారని మండిపడ్డారు. ఈరోజు తమకు కోర్టులో న్యాయం జరిగిందని పేర్కొన్నారు. చంద్రబాబు మీద వ్యక్తిగత కక్షతోనే ఈ విధంగా చంద్రబాబును జైలుపాలు చేశాడని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబును ఇక ఏశక్తీ ఆపలేదన్నారు. అన్ని కేసులూ అక్రమమని త్వరలోనే తేలిపోతుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications