వైయస్ విజయమ్మకు చినరాజప్ప కౌంటర్, పవన్-జగన్ నాశనం చేసే శక్తులుగా: టీడీపీ
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడి ఘటనపై ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ నేతలు, మంత్రులు చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం కౌంటర్ ఇచ్చారు.

విజయమ్మ మాటలు సరికాదు
జగన్ పైన దాడి ఘటనలో విచారణ కొనసాగుతోందని చినరాజప్ప చెప్పారు. కేసు విచారణ సాగుతుండగా విజయమ్మ మాట్లాడటం ఏమాత్రం సరికాదని చెప్పారు. ఈ కేసు విషయంలో జగన్ కచ్చితంగా నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. జగన్ విచారణకు సహరించకుండా ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసం అన్నారు. తాను జగన్ అభిమానిని అని నిందితుడు శ్రీనివాస రావే అంగీకరించారన్నారు. సిట్ నివేదిక రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు.

జగన్ సహకరించట్లేదు
కేసు విచారణ సరిగ్గా సాగడం లేదని విజయమ్మ చెప్పడం సరికాదని చినరాజప్ప అన్నారు. జగన్ విచారణకు, వాంగ్మూలం ఇచ్చేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారని మండిపడ్డారు. సిట్ పూర్తిస్థాయి విచారణకు కొంత సమయం పడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చక్కటి పాలన అందిస్తున్నారన్నారు. కేంద్రం సహకరించకున్నా శాంతిభద్రతల పరిరక్షణలో, అభివృద్ధిలో ఏపీ దూసుకుపోతోందన్నారు.

జగన్ కోడి కత్తి నాటకం అట్టర్ ప్లాప్
ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో సీఎం చంద్రబాబును గద్దె దించేందుకు జగన్ కుట్ర పన్నారని కర్నూలు టీడీపీ నేత, కుడా చైర్మన్ సోమిరెడ్డి వెంకటేశ్వర్లు వేరుగా ఆరోపించారు. జగన్ కోడి కత్తి నాటకం అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. ఏపీ పోలీసుల సహకారం లేకుండా జగన్ పాదయాత్ర 3,000 కిలోమీటర్లు ప్రశాంతంగా ఎలా సాగిందో చెప్పాలని నిలదీశారు.

ప్రభుత్వాన్ని కూల్చడంలో జగన్ దిట్ట
ప్రభుత్వాలను కూల్చడంలో జగన్ దిట్ట అని సోమిరెడ్డి అన్నారు. ఒకవేళ జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపీ పరిస్థితి అంతే సంగతులన్నారు. జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని నాశనం చేసే దుష్టశక్తులుగా తయారయ్యారని తీవ్రంగా విమర్శించారు. జగన్ పార్టీ గుర్తుగా ఫ్యాన్‌ను తీసేసి కోడి కత్తిని పెట్టుకోవాలన్నారు. మోడీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు దేశంలోని పదహారు విపక్ష పార్టీలను ఏకం చేశారన్నారు.












Click it and Unblock the Notifications