పార్ధసారధి యూటర్న్ - వాట్ నెక్స్ట్..!!
ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెనమలూరులో వైసీపీ నుంచి గెలిచిన పార్ధసారధి టీడీపీ వైపు వెళ్లారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో నూజివీడు సీటు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో, నూజివీడు పోటీకి వీలుగా స్థానిక టీడీపీ నేతలతో పార్ధసారధి మంత్రాంగం ప్రారంభించారు. అక్కడ టీడీపీ ఇంఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సమయంలోనూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
కీలక మార్పులు : మాజీ మంత్రి పార్ధసారధి ఎన్నికల సమయంలో వైసీపీ వీడి టీడీపీ వైపు మళ్యారు. పార్ధసారధిని మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ సూచించింది. అందుకు పార్ధసారధి అంగీకరించలేదు. దీంతో, పెనమలూరు నుంచి కొనసాగించటం పైన ఆలోచన చేస్తున్న సమయంలోనే పార్ధసారధి పార్టీ వీడాలని నిర్ణయించారు. చంద్రబాబుతో సమావేశమయ్యారు. పార్ధసారధి ఆశించిన పెనమలూరు నుంచి కాకుండా నూజీవీడు స్థానం కేటాయించేందుకు చంద్రబాబు నిర్ణయించారు. దీనికి పార్ధసారధి అంగీకరించారు. కానీ, పార్ధసారధి రాకకు టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఆయన చంద్రబాబుతో సమావేశమయ్యారు.

పోటీ ఎక్కడ : పార్ధసారధికి సీటు కేటాయించే అంశాన్ని ఆయన వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. పార్ధసారధికి సహకరిస్తే పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సముచిత ప్రాధాన్యత పైన హామీ ఇచ్చినట్లు సమాచారం. అదే సమయంలో పెనమలూరు టీడీపీ ఇంఛార్జ్ బోడే ప్రసాద్ తో పార్ధసారధి సమావేశమయ్యారు. కానీ, ఒక్క రోజులోనే పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా పెనమలూరులో టీడీపీ అభ్యర్దిగా పార్ధసారధి పేరు పైన సర్వేలు మొదలయ్యాయి. పార్టీ కార్యకర్తలకు అభిప్రాయం సేకరణలో బోడే ప్రసాద్ పేరు ప్రస్తావన లేకుండా కేవలం పార్ధసారధి పేరుతోనే సర్వే చేయిస్తున్నారు. పార్ధసారధి పేరు నచ్చక పోతే నోటాకు నొక్కాలంటూ చంద్రబాబు స్వరంతో అభిప్రాయ సేకరణ జరుగుతోంది.

నిర్ణయం పై ఉత్కంఠ : దీంతో, ఇప్పుడు పార్ధసారధిని తిరిగి పెనమూలూరు నుంచి పోటీకి దింపుతారనే సందేహాలు మోదలయ్యాయి. దీనిని బోడే ప్రసాద్ మద్దతు దారులు వ్యతిరేకిస్తున్నారు. మైలవరంలో సీటు విషయంలో నిర్ణయానికి అనుగుణంగా పెనమలూరులో అభ్యర్దిని ఖరారు చేస్తారని తెలుస్తోంది. మైలవరంలో వసంత, దేవినేని ఉమా లో ఎవరికి సీటు దక్కుతుందనేది అక్కడ ఆసక్తి కరంగా మారింది. అక్కడ సీటు దక్కని వారిని పెనమలూరు నుంచి పోటీకి దింపే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో నూజివీడు, పెనమలూరు, మైలవరం నియోజకవర్గాల్లో అభ్యర్దుల ఎంపిక పైన చంద్రబాబు నిర్ణయం ఏంటనేది పార్టీలో ఆశావాహుల్లో ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications