పులివెందులపై టీడీపీ మైండ్ గేమ్!! ఢీ అంటున్న జగన్
పులివెందుల నియోజకవర్గమంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి అది కంచుకోట. పార్టీలకు అతీతంగా వ్యక్తులను గెలిపిస్తున్న నియోజకవర్గం అది. వైఎస్ కుటుంబం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీదే గెలుపు. అది రెడ్డి కాంగ్రెస్ కావచ్చు.. హస్తం కాంగ్రెస్ కావచ్చు.. వైఎస్సార్ కాంగ్రెస్ కావచ్చు. అంతలా ఆ కుటుంబంతో అక్కడి జనజీవనం కలిసిపోయింది.

విరుగుడు చర్యలు చేపట్టిన జగన్
మూడురోజుల పర్యటనకు సొంత నియోజకవర్గం పులివెందుల వెళ్లిన సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తన మొదటిరోజు పర్యటనలో వేముల మండలం వేల్పులలో మోడల్ సచివాలయాన్ని ప్రారంభించారు. రెండోరోజు పర్యటనలో తన తండ్రి వర్థంతి సందర్భంగా నివాళులర్పించి నియోజకవర్గంపై సమీక్ష జరిపారు. రానున్న ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబును ఓడించాలనే లక్ష్యంతో ఉన్న జగన్‌కు దీటుగా తెలుగుదేశం పార్టీ పులివెందులలో జగన్‌ను ఓడిస్తామని ప్రకటించింది. ఇక్కడ వైఎస్ కుటుంబాన్ని ఓడించడం కష్టమని తెలిసినా టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని భావించిన వైసీపీ అందుకు విరుగుడు చర్యలు చేపట్టింది.

అందరికీ హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి
సొంత నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రికి వ్యతిరేకత వ్యక్తమవుతోందని, రాబోయే ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థిగా వారి కుటుంబ సభ్యులే పోటీచేస్తారంటూ ప్రచారం నడుస్తోంది. వైసీపీ శ్రేణులను మానసికంగా దెబ్బకొట్టడానికి, వారిని చీల్చడానికి తెలుగుదేశం పార్టీయే ఈ తరహా మైండ్ గేమ్ ఆడుతోందని భావించిన జగన్ అందుకు చెక్ పెట్టే పనిని ప్రారంభించారు. పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ కార్యక్రమాలన్నీ జగన్ తరఫున ఆయన బంధువులే చక్కబెట్టేవారు. ఏ పనులున్నా వారిని కలిస్తే సరిపోయేది. అయితే ఇటీవల బంధువులతో జగన్‌కు దూరం పెరగిందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. బిల్లులు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయని వాటిని మంజూరు చేయించాలని కోరారు. చేయిస్తానని హామీ ఇవ్వడంతోపాటు ఎవరూ అసంతృప్తిగా ఉండవద్దని ముఖ్యమంత్రి సూచించారు.

ఆనందం వ్యక్తం చేసిన పార్టీ నాయకులు
జగన్ తమతో ప్రత్యేకంగా భేటీ కావడంపై మండలాలవారీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన బాబాయికానీ, కొండారెడ్డి, ఇతరులతోనే మాట్లాడేవారిమని, ఇప్పుడు నేరుగా జగన్‌తోనే మాట్లాడటంతోపాటు తమ సమస్యలన్నీ తెలుసుకొని పరిష్కరిస్తానన్నారని ఆనందంగా చెబుతున్నారు. ప్రచారం చేయకపోయినా గెలవగలిగే ధీమా ఉన్నప్పటికీ ప్రత్యర్థులకు ఏ చిన్న అవకాశం కూడా వదిలిపెట్టకూడదనే ఉద్దేశంలో జగన్ ఉన్నారని, అందుకే ప్రత్యేకంగా పులివెందులపై దృష్టిసారించి అక్కడి నాయకుల్లో అరకొరగా ఉన్న అసంతృప్తిని కూడా దూరం చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications