టెన్షన్.. టెన్షన్.. : కదిరిలో టీడీపీ-వైసీపీ ఫైట్
కదిరి : ఏపీ సీఎం చంద్రబాబును విమర్శిస్తూ ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో అగ్గి మీద గుగ్గిలంలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న టీడీపీ శ్రేణులు జగన్ రైతు భరోసా యాత్రలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
దీనికి తోడు 'చెప్పుతో కొడుతానంటూ..' తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని జగన్ ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు గట్టిగా ప్రతిఘటించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం తెల్లవారుజామున జగన్ బస చేసిన కదిరి గెస్ట్ హౌజ్ ఎదుట ఆందోళనకు దిగారు టీడీపీ కార్యకర్తలు.

కదిరి టీడీపీ ఇంఛార్జీ కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు గెస్ట్ హౌజ్ ముందు ఆందోళన చేపట్టారు. కాగా, తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటనను ముగించుకున్న తర్వాత శుక్రవారం అర్ధరాత్రి కదిరి గెస్ట్ హౌజ్ లో బస చేశారు జగన్. దీంతో విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు శనివారం తెల్లవారుజాము సమయంలో గెస్ట్ హౌజ్ బయట జగన్ కి వ్యతిరేకంగా ఆందోళన చేశారు.
దీంతో అక్కడే ఉన్న వైసీపీ శ్రేణులు, టీడీపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొన్న కదిరిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.












Click it and Unblock the Notifications