ఘోర రోడ్డు ప్రమాదం: పెళ్లి బృందంలో 17 మంది దుర్మరణం
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కందుకూరు మండలం చెర్లపాలెం వద్ద శ్రీకృష్ణా ట్రావెల్స్ బస్సు, డిసిఎం వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా, మరో 9 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు.
ప్రైవేట్ బస్సు పామూరు నుంచి కందుకూరు వైపు వస్తుండగా, కందకూరు నుంచి మాలకొండ వైపు వెళ్తిన్న డిసిఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. రెండు వాహనాలు అతి వేగంలో ఢీకొన్నాయి. దీంతో పక్కనే ఉన్న కాలువలో పడ్డాయి. దాంతో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు దగ్ధమైంది.

అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మృతులు ప్రకాశం జిల్లా చేవూరుకు చెందినవారు. ప్రమాదం జరిగిన సమయంలో డిసిఎం వ్యానులో 15 మంది ఉండగా, ప్రైవేట్ బస్సులో డ్రైవర్ మినహా ప్రయాణికులు ఎవరూ లేరు.
డిసిఎం వ్యానులో పెళ్లి బృందం ప్రయాణిస్తోంది. బస్సులో ప్రయాణికులు ఉండి ఉంటే ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండేది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలేనని తెలుస్తోంది. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడినవారిని కందుకూరు ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications