
నిమ్మగడ్డ స్ధానంలో నీలం సాహ్నీ- ఈసారి టీడీపీ వర్సెస్ ఎస్ఈసీ- నిష్పాక్షికత ఏదీ ?
ఏపీలో స్దానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో వైసీపీ సర్కారుతో ముఖాముఖీ పోరాడిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా పదవీ విరమణ చేశారు. ఆయన హయాంలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ వాయిదాతో మొదలుపెట్టి తిరిగి నిర్వహించే వరకూ లెక్కలేనన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. ఆయన నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు ఆయన స్ధానంలో వచ్చిన నీలం సాహ్నీ సైతం మొదటి రోజు నుంచే వివాదాల్లో చిక్కుకుంటున్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న వీరు ఇలా తమ నిర్ణయాలతో వివాదాస్పదం కావడంపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.

కాకరేపుతున్న ఎస్ఈసీల నిర్ణయాలు
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించే ఎన్నికల కమిషనర్ పదవి నానాటికీ వివాదాస్పదంగా మారిపోతోంది. ఇది పార్టీల రాజకీయ వైఖరుల వల్లా, ఎస్ఈసీ నిర్ణయాల వల్లా అనేది పక్కనబెడితే నిష్పాక్షితంగా రాజ్యాంగ పరమైన బాధ్యతలు నిర్వర్తించాల్సిన ఎస్ఈసీలు ఇలా విమర్శలకు తావివ్వడం ఏంటనే చర్చ సగటు ప్రజల్లో జరుగుతోంది. ఎక్కడో ఒక నిర్ణయం తప్పో, పొరబాటో అయితే సరే.. కానీ ఇప్పుడు ఏపీలో ఎస్ఈసీలుగా ఉన్న వారు తీసుకునే దాదాపు ప్రతీ నిర్ణయం వివాదం రేపడం, విమర్శలకు తావివ్వడం సర్వసాధారణమైపోతోంది. దీంతో ఎన్నికల సంఘం ప్రతిష్ట దిగజారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వైసీపీ వర్సెస్ నిమ్మగడ్డ పోరు
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. వైసీపీ ప్రభుత్వ హయంలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్ధితి. స్ధానిక ఎన్నికల వాయిదాపై ఆయన తీసుకున్న నిర్ణయంపై వైసీపీ ప్రభుత్వ పెద్దలు అప్పట్లో భగ్గుమన్నారు. ఆ తర్వాత కూడ ఆయన్ను అత్యవసర ఆర్డినెన్స్ తెచ్చి పదవిలో నుంచి తప్పించారు. తిరిగి హైకోర్టు ఉత్తర్వులతో ఆయన పదవిలోకి వచ్చారు. స్ధానిక ఎన్నికల విషయంలో ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడంలో నిమ్మగడ్డ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. వైసీపీ పట్టుదల కూడా అదే స్ధాయిలో కొనసాగింది. దీంతో చివరికి వైసీపీ, నిమ్మగడ్డ మధ్య సాగిన పోరు ఏపీ చరిత్రలో నిలిచిపోయింది.

నీలం సాహ్నీ వర్సెస్ టీడీపీ పోరు
మూడు రోజుల క్రితం నిమ్మగడ్డ స్ధానంలో కొత్త ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నీ కూడా తొలిరోజే హడావిడిగా జారీ చేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వివాదాస్పదమైంది. అదీ రాజకీయపార్టీలను అభిప్రాయాలు చెప్పమని పిలిచి, అంతకంటే ముందే నోటిపికేషన్ ఇచ్చేయడం ఆయా పార్టీల్ని అవమానించినట్లయింది. దీంతో సగం పార్టీలు ఆమె నిర్వహించిన రాజకీయ పార్టీల భేటీకి హాజరుకాలేదు. చివరికి పార్టీల అభిప్రాయాలు తీసుకోకుండానే నీలం జారీ చేసిన నోటిఫికేషన్ సైతం పార్టీలకు ఆగ్రహం కలిగించింది. దీనిపై బీజేపీ, జనసేన హైకోర్టులో విడివిడిగా పిటిషన్లు వేశాయి. టీడీపీ అయితే ఏకంగా ఎన్నికలనే బహిష్కరించేసింది.

తప్పు ఎస్ఈసీలదా ? రాజకీయ పార్టీలదా
రాష్ట్ర ఎన్నికల కమిషనర్లుగా రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటున్న వారు తీసుకునే ప్రతీ నిర్ణయంపై పార్టీలు, అభ్యర్ధులే కాదు సామాన్యుల దృష్టి కూడా ఉంటుంది. అటువంటప్పుడు వారు తీసుకునే ప్రతీ నిర్ణయం ఆచితూచి తీసుకోవాలి. రాజ్యాంగ పరిధిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. న్యాయ వివాదాలకు, అనవసర చర్చలకు తావిచ్చేలా ఉండకూడదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది చూస్తుంటే కచ్చితంగా అందుకు భిన్నంగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. అయితే దీనికి కారణం ఎస్ఈసీలా, వారిపై ప్రభావం చూపుతున్న రాజకీయ పార్టీలదా అంటే ఇతమిత్థంగా చెప్పలేని పరిస్ధితి. రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలు అంతిమంగా రాజకీయ నిర్ణయాలుగానే మిగిలిపోతాయి. వాటిపై పెద్దగా చర్చ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఎస్ఈసీలు తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎన్నికలపై, రాష్ట్ర ప్రజలపై తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఎస్ఈసీల నిర్ణయాలు లోపరహితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.