యూనిఫాంను ఎలుకలు కొరికేశాయి మేడమ్!
తిరుపతి నగరపాలక కమిషనర్‌గా హరిత బాధ్యతలు స్వీకరించారు. వెంటనే అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఒకటో డివిజన్ పరిధిలోని తిరుమలరెడ్డి సచివాలయ వీఆర్వో ప్రసాద్ యూనిఫాం లేకుండా సమీక్షకు హాజరయ్యారు. సచివాలయ ఉద్యోగులంతా యూనిఫాంలో వస్తే.. ఒక్కడివే యూనిఫాంలో ఎందుకు రాలేదని వీఆర్వోను కమిషనర్ హరిత ప్రశ్నించారు. తన యూనిఫాంను ఎలుకలు కొరికేశాయని ప్రసాద్ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం.. రీసర్వేలో కూడా వెనుకంజలో ఉన్నట్లు అధికారులు చెప్పడంతో ప్రసాద్ ను సస్పెన్షన్ చేయాలని అధికారుల్ని కమిషనర్ ఆదేశించారు. వెంటనే అధికారులు ఉత్తర్వులిచ్చారు. ప్రసాద్ బాధ్యతలను మరో వీఆర్వోకు అప్పగించారు.
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిని అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని హరిత అన్నారు. తిరుపతిపై తనకు పూర్తి అవగాహన ఉందని.. భవిష్యత్‌లో పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతామని, ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయిస్తానన్నారు.

ప్రజావసరాలకే తొలి ప్రాధాన్యమిస్తానని, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మాస్టర్‌ప్లాన్ రోడ్లను సకాలంలో పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన సమస్యలు, వాటి పరిష్కారానికి ఎన్ని రోజులు పడుతుంది? బాధితులకు ఎటువంటి భరోసానిస్తున్నారు? తదితర విషయాలను కూలంకుషంగా అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications