TTD: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్ - దర్శన టోకెన్ల జారీలో కీలక మార్పులు..!!
Tirumala: తిరుమలలో రద్దీ క్రమేణా పెరుగుతోంది. దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. తిరుమల లో మరో వైపు వచ్చే నెలలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం చేసారు. ఇటు భక్తుల కు త్వరగా దర్శనం జరిగేలా క్యూ లైన్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ సూచనలు చేస్తున్నారు. ఇక.. శ్రీవాణి దర్శనం కోటా టోకెన్ల జారీ విషయంలో టీటీడీ కొత్త ఆలోచన చేస్తోంది. భక్తుల అభిప్రాయాలకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోనుంది.
తిరుమలలో శ్రీవాణి కోటా దర్శన విధానంలో టీటీడీ తాజాగా మార్పులు చేసింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ మార్పుల పైన భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని తదనుగుణంగా మార్పులు చేసేలా టీటీడీ కసరత్తు చేస్తోంది. కాగా, శ్రీవాణి టికెట్ల జారీ విధానం మార్పులు - చేర్పులు చేయాలని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం రోజుకు 500 టికెట్లను ఆన్ లైన్ లో.. మరో వెయ్యి టికెట్లను టీటీడీ ఆఫ్ లైన్ లో జారీ చేస్తోంది. అయితే, భవిష్యత్ లో మొత్తం టికెట్లను పూర్తిగా ఆన్ లైన్ ద్వారా మాత్రమే జారీ చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. కాగా.. ప్రస్తుతం ఆన్ లైన్ లో మూడు నెలల ముందుగానే భక్తులు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. కానీ, ఆఫ్ లైన్ టికెట్లు మాత్రం ఏ రోజుకు ఆ రోజు మాత్రమే టీటీడీ జారీ చేస్తోంది.

అయితే, ఆఫ్ లైన్ టికెట్ కోటాకు ఎక్కువ డిమాండ్ ఏర్పడి భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో.. ఈ సమస్యను అధిగమించేందుకు ఆఫ్ లైన్ కోటాను కూడా అదే రోజుకు ఆన్ లైన్ లో జారీ చేసే విధానం టీటీడీ పరిశీలిస్తోంది. ఈ విషయం పై భక్తుల అభిప్రాయాలను సేకరించి.. తుది నిర్ణయం తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది.
అటు నవంబర్ నెలకు సంబంధించిన దర్శన కోటా టోకెన్లను ఆన్ లైన్ విధానంలో టీటీడీ ప్రస్తుతం జారీ చేస్తోంది. ఈ రోజు శ్రీవాణి దర్శనం.. అంగప్రదిక్షణ కోటా టికెట్లను జారీ చేసారు. ఇక.. వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.












Click it and Unblock the Notifications