TTD: శ్రీవారి దర్శనం, వసతి, అంగప్రదక్షిణం టికెట్లు విడుదల - షెడ్యూల్ ఇలా..!!
Tirumala: తిరుమల భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది. నవంబరు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల షెడ్యూల్ ను ప్రకటించింది. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు షెడ్యూల్ ప్రకారం నవంబరు నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీడిప్ నమోదుకు అవకాశం కల్పించిన టీటీడీ, ఇప్పుడు సేవా, దర్శన, వసతి టికెట్లను విడుదల చేయనుంది.
సేవా టికెట్లు విడుదల : నవంబర్ మాసానికి సంబంధించి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను ఆగస్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే విధంగా వర్చువల్ సేవా టికెట్లను ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

ఇక, భక్తులు పెద్ద సంఖ్యలో కోరుకొనే ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆగస్టు 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం టికెట్లను ఆగస్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని నిర్ణయించారు. వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.
దర్శనం, వసతి టోకెన్లు : నవంబర్ మాసానికి సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. తిరుమల, తిరుపతిలలో వసతి గదుల బుకింగ్ ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది.
గతం కంటే ఈ సారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల సంఖ్యను టీటీడీ పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఈ టికెట్లను పొందాలనే భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://tirupatibalaji.ap.gov.in లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 25వ తేదీ శుక్రవారం వరలక్ష్మీ వ్రతంఘనంగా నిర్వహించనున్నారు.

వరలక్ష్మీవ్రతం లో పాల్గొనాలంటే : ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వ్రతాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భక్తులు నేరుగా వ్రతంలో పాల్గొనేందుకు ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేస్తున్నారు.
అదేవిధంగా ఆలయం వద్ద గల కుంకుమార్చన కౌంటర్‌లో ఆగస్టు 24 వ తేదీ ఉదయం 9 గంటలకు కరెంట్ బుకింగ్‌లో 150 టికెట్లు విక్రయిస్తారు. రూ.1000/- చెల్లించి భక్తులు టికెట్ కొనుగోలు చేయవచ్చు. ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు. వర్చువల్ టికెట్లు పొందిన భక్తులకు ఆగస్టు 26వ తేదీ నుండి 90 రోజులలోపు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.












Click it and Unblock the Notifications