తెలంగాణXఏపీ: బాబుకు తలసాని హెచ్చరిక, పాకిస్తాన్‌లా చూస్తారా.. గాలి
హైదరాబాద్: కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల పైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మంగళవారం నాడు ఇరు రాష్ట్రాల నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. వైసిపి ఏపీ సీఎం చంద్రబాబును కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రాజెక్టుల విషయమై మాట్లాడుతూ... ఏపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే పలు ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఎవరైనా చిల్లర రాజకీయాలు చేస్తే వారే ఇబ్బందుల్లో పడతారని చంద్రబాబు, జగన్‌ను ఉద్దేశించి అన్నారు.
సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. సమైక్య రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాల వల్ల పాలమూరు తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు.
సాటి తెలుగు ప్రజల బాధ పట్టదా: గాలి
సాటి తెలంగాణ ప్రజల బాధ తెలంగాణకు పట్టదా అని ఏపీ తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రశ్నించారు. ఏపీని కేసీఆర్ పాకిస్తాన్‌లా చూస్తున్నారని ధ్వజమెత్తారు.
విభజనకు ముందు ఉన్న కక్షను ఇప్పటికీ కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రాయలసీమకు నీళ్లు రాకుండా చేయడం అన్యాయమని చెప్పారు. పోలవరానికి నీరు రాకుండా కుట్ర జరుగుతోందన్నారు. తెలుగు వారి కంటే తెలంగాణ ప్రభుత్వానికి మహారాష్ట్ర ఎక్కువనా అని ప్రశ్నించారు.
కెసిఆర్, బాబుపై మండిపడ్డ భూమన
తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తయితే సీమాంధ్రకు తీరని నష్టం అని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టుల పైన జగన్ దీక్ష చేస్తున్నప్పటికీ.. చంద్రబాబుకు మాత్రం చీమకుట్టనట్లు లేదన్నారు. జగన్ స్పందిస్తేనే స్పందిస్తారా అని నిలదీశారు.
తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ కేబినెట్ నిర్ణయం దివాళాకోరుతనానికి నిదర్శనం అన్నారు. కేసుల నుంచి బయటపడేందుకే ప్రాజెక్టుల పైన స్పందించడం లేదన్నారు. ప్రాజెక్టుల పైన కెసిఆర్‌కు చంద్రబాబు లొంగిపోయారన్నారు. ఏపీ ప్రయోజనాలు దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 16వ తేదీన జగన్ దీక్ష చేస్తారని చెప్పారు.
మీకెందుకు కడుపు మంట: ఇంద్రకరణ్
తెలంగాణలో నిర్మిస్తోన్న ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్రానికి ఉత్తరం రాయాలని ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని స్పష్టం చేశారు.
తమకు రావాల్సిన నీటి వాటాను మేం వాడుకుంటే మీకెందుకు కడుపు మంట? అని ప్రశ్నించారు. సీఎం కెసిఆర్ నిర్ణయాన్ని ఎవరు అడ్డుకున్నా సహించేదిలేదన్నారు. గతంలో మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు సహా ఎన్నో అడ్డంకులు సృష్టించారని గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని తెలిపారు. నిధులు, నియామకాలు అయిపోయాయి, ఇక మిగిలింది నీళ్లేనని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో 1350 టీఎంసీలు తెలంగాణ వాడుకోవచ్చని గతంలో జీవో ఇచ్చారని పేర్కొన్నారు.

బాబు వైఖరి సరికాదు: ఎంపీలు
పాలమూరు-రంగారెడ్డి సహా తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు వైఖరిని ఖండిస్తున్నట్లు టీఆర్‌ఎస్ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సీతారాం నాయక్‌లు అన్నారు. గతంలో నీటి పంపకాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, తెలంగాణ ఆనకట్టలను అడ్డుకోవడం అన్యాయమన్నారు.
ఏపీ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం కాదని, ఎత్తు తగ్గించాలని మాత్రమే కోరుతున్నామన్నారు. పోలవరం ఎత్తు తగ్గించకపోతే భద్రాచలం దేవాలయం సహా ఆదివాసీలకు తీరని నష్టం జరుగుతుందని, ప్రాజెక్టుల విషయంలో కేంద్రం చట్ట ప్రకారం నడుచుకోవాలన్నారు.
చంద్రబాబు నాయుడు మహబూబ్‌నగర్‌ను దత్తత తీసుకుని ఏం అభివృద్ధి చేశారో తెలంగాణ టీడీపీ నేతలు చెప్పాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాయనున్న ఏపీ ప్రభుత్వ తీరుపై అదేవిధంగా ఎమ్మెల్యేలు డీకే అరుణ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు.
రాష్ట్రం విడిపోయినా తెలంగాణపై చంద్రబాబు కక్ష కట్టడం దుర్మార్గం అన్నారు. ఏపీలో పాలన చేతకాక తెలంగాణ ప్రాజెక్టులపై కుట్రలు చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడవద్దని, ఎంత ఖర్చు అయినా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.
డీకే అరుణకు ప్రాజెక్టులపై ఏమాత్రం అవగాహన లేదని, వీరిరువురి రాజకీయాలను చూసి పాలమూరు ప్రజలు అసహ్యించుకుంటున్నరన్నారు. సమైక్య పాలనలో బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయన్నారు. పాలమూరు భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.












Click it and Unblock the Notifications