ఎట్టకేలకు మెత్తబడ్డ సోము వీర్రాజు: అజ్ఞాతం నుంచే కీలక ప్రకటన!
Recommended Video

విజయవాడ: కాంగ్రెస్ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణను పార్టీ అధ్యక్షుడిగా చేయడంతో.. బీజేపీ నేతల్లో అసంతృప్తి రాజేసినట్టయింది. ముఖ్యంగా పార్టీ అధ్యక్ష పదవిపై గంపెడాశ పెట్టుకున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. ఈ నిర్ణయంపై తీవ్ర నిరాశ చెందారు.
కన్నాను అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ఆదివారం ఉదయం ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఇదే క్రమంలో ఆయన అనుచరులు, తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాలకొండయ్య, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా కమిటీ అధ్యక్షుడు బొమ్ముల దత్తు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో బీజేపీలో ముసలం ముదిరినట్టే కనిపించింది.

అయితే బీజేపీ అధిష్టానం బుజ్జగింపులకు దిగిందో మరేమో గానీ ఎట్టకేలకు సోము వీర్రాజు మెత్తబడ్డారు. పార్టీ నిర్ణయాన్ని సమర్థిస్తూ అజ్ఞాతం నుంచే ఒక ప్రకటన చేశారు. 'అధిష్టానం ఎంపికను అందరూ సమర్థించాల్సిందే. పార్టీ నిర్ణయమే అంతిమం కాబట్టి దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. పెద్దల నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించవద్దు' అని ఆయన పేరుతో ఒక ప్రకటన బయటకొచ్చింది.
అసలే హోదా విషయంలో ఇప్పటికే బీజేపీ రాష్ట్రంలో బద్నాం అయిపోయిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో పార్టీ అంతర్గత వ్యవహారాలు రచ్చకెక్కితే మరింత డ్యామేజ్ తప్పదని బీజేపీ అధిష్టానం భావించి ఉండవచ్చు. ఈ నేపథ్యంలోనే సోము వీర్రాజును బుజ్జగించి గొడవలు సద్దుమణిగేలా చేస్తున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications