ఒక్క అవకాశం, రెండు రాష్ట్రాల అభివృద్ధి: చంద్రబాబు
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తమకు ఒక్క అవకాశం ఇస్తే రెండు రాష్ట్రాలను అభివృద్ది చేసి చూపిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున టిడిపిలో చేరారు. ఇందులో పలువురు రిటైర్డ్ ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడారు.
రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి ఒక్క తెలుగుదేశంతోనే సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు బేరం కుదుర్చుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు.

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చొక్కా నలుగకుండా నాయకుడయ్యారని ఎద్దేవా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడని అన్నారు. ప్రజలకు తెలుగుదేశం పార్టీ ద్వారా అందుబాటులో ఉండేందుకే నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని చంద్రబాబు తెలిపారు. పారిశ్రామిక వేత్తలు, రిటైర్డ్ ప్రభుత్వ అధికారులు తమ పార్టీలో చేరారని ఆయన తెలిపారు.
సీమాంధ్ర ప్రజలు టిడిపి వైపే ఉన్నారని చంద్రబాబు చెప్పారు. తెలంగాణలో కూడా టిడిపి బలంగా ఉందని తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టిడిపి అధికారంలోకి వస్తే తప్ప సీమాంధ్రకు భవిష్యత్ లేదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications