ధిక్కరిస్తే అంతే, జంపింగ్ చిట్టా ఉంది: బొత్స, జగన్ పైనా
హైదరాబాద్: పార్టీ అధిష్టానాన్ని ఎవరు ధిక్కరించినా చర్యలు తీసుకుంటామని, పార్టీలో ఉంటూ నష్టం చేసే వారు వందమంది ఉన్నా వేస్టేనని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం అన్నారు. ఆయన గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడారు.
అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించిన చర్యలు తప్పవన్నారు. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ శాసన సభ్యులు జెసి దివాకర్ రెడ్డి ఇచ్చే వివరణ ఆధారంగా తాము ఆయనపై చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే మరోసారి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. ఊసరవెల్లి రాజకీయాలు చేసే వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

పార్టీని వదిలి వెళ్లే వారి జాబితా జిల్లా శాఖల వద్ద ఉందన్నారు. పార్టీ నుండి ఎవరు వెళ్లినా నష్టమేనని అయితే, పార్టీలో ఉంటూ నష్టం కలిగించే వారు వందమంది ఉన్నా వృథానే అన్నారు. ప్రజలలో ఉన్న సెంటిమెంటును ఆసరాగా చేసుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.
తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ప్రాంతాల వారీగా తమ వాదనలను వినిపిస్తారన్నారు. విభజనకు సిపిఎం, మజ్లిస్ సహా అన్ని పార్టీలు అంగీకరించాయన్నారు. అన్ని పార్టీలు విభజనపై అభిప్రాయం చెప్పాకే తమ పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు కారణమన్నారు.
విభజనపై కాంగ్రెసు పార్టీని విమర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తే వారితో పొత్తు పెట్టుకునేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చూస్తోందన్నారు. 23 తర్వాత రాష్ట్రపతి నిర్ణయం ఇస్తే బిల్లుపై చర్చ జరుగుతుందన్నారు. పాలెం బస్సు ప్రమాదం కేసు బాధ్యత పోలీసులదే అన్నారు.












Click it and Unblock the Notifications