మూడో స్థానంలో: కెసిఆర్‌పై పొన్నాల, లెక్క తారుమారు
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో తెలంగాణ రాష్ట్ర సమితి మూడో స్థానంలో ఉందని, తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామని టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సోమవారం అన్నారు. గాంధీ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తల పట్టుదల వల్లే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధించిందన్నారు.
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెసు పార్టీని ప్రజలు ఆదరించారని అందుకే తాము అత్యధిక మున్సిపాలిటీల్లో గెలుపొందామని చెప్పారు. తనకున్న సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి మూడో స్థానంలో ఉందన్నారు. టిడిపి, బిజెపి కూటమి రెండో స్థానంలో ఉందన్నారు.

తెరాస గెలుచుకున్న తొమ్మిది మున్సిపాలిటీల్లో ఐదు కరీంనగర్ జిల్లా నుండే ఉన్నాయన్నారు. దీనిని బట్టే తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి తెలిసిపోతుందన్నారు. ప్రజలు తమ పట్ల ఆదరాభిమానాలతో ఉన్నారన్నారు. కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తుందని తాము మొదటి నుండి చెబుతున్నామని, ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. తాము తప్పకుండా అధికారంలోకి వస్తామన్నారు.
తెరాస లెక్కలు తారుమారు: కోమటిరెడ్డి
తెలంగాణ రాష్ట్ర సమితి లెక్కలు తారుమారు అయ్యాయని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి నల్గొండ జిల్లాలో అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెసు విజయం సాధించినట్లే సాధారణ ఎన్నికల్లోను గెలుపొందుతామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెసు పార్టీని ఆదరించారన్నారు. తెలంగాణలో తమ ప్రభుత్వమే వస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెసు పార్టీని పూర్తిగా విశ్వసిస్తున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications