బిజెపి, టిడిపి పొత్తు: ఎవరికి లాభం? పవన్ పట్టుబట్టితే..

పొత్తుకు మానసికంగా సిద్ధం కావాలని సూచించారు. పొత్తుపై తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాల్లో నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్రలో బిజెపికి పెద్దగా బలం లేదు, ఆ పార్టీతో పొత్తు వల్ల పార్టీకి కలిగే ప్రయోజనం ఏముందని సీమాంధ్ర టిడిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే అన్ని కోణాల్లో ఆలోచించి చంద్రబాబు పొత్తుపై నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని సీమాంధ్ర దేశం నాయకులు చెబుతున్నారు.
గతంలో ఉభయ గోదావరి జిల్లాల్లో విశాఖ, చిత్తూరు జిల్లాల్లో బిజెపి ఎంపి అభ్యర్థులు విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి. 1999 వరకు బిజెపి పరిస్థితి బాగానే ఉన్నా, తరువాత 2004 నాటికి టిడిపితో పొత్తు పుణ్యామా అని బిజెపి పూర్తిగా బలహీనపడిందనే అభిప్రాయం బిజెపిలో బలంగా ఉంది. బలహీనంగా ఉన్న పార్టీతో పొత్తు అవసరం ఏమిటనేది టిడిపి నాయకుల వాదన. అయితే పార్టీ నాయకత్వం ఆలోచన మరో విధంగా ఉంది.
సీమాంధ్రలో బిజెపి సొంతంగా విజయం సాధించలేకపోవచ్చు కానీ టిడిపికి ఉపయోగపడుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన అన్ని సర్వేలు సైతం ఇదే విషయాన్ని తేల్చి చెప్పాయి. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీతో సన్నిహితంగా ఉండడం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లగలిగితే బిజెపితో పొత్తు వల్ల సీమాంధ్రలో టిడిపికి ప్రయోజనం కలుగుతుందంటున్నారు.
విభజన అంశంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని, కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది, మనం బిజెపితో పొత్తు పెట్టుకుంటే ఆ వ్యతిరేకత మనపై కూడా పడుతుంది అని కొందరు టిడిపి నాయకులు వాదిస్తున్నారు. అయితే ఈ అంశాన్ని పార్టీ చంద్రబాబుదృష్టిలో పెట్టుకున్నాడని అందుకే వెంటనే పొత్తు గురించి ప్రకటన చేయలేదంటున్నారు.
విభజన ముగిసిపోయిన అంశం, ఇప్పుడు దాని గురించి ఆలోచించి వృధా, ప్రస్తుతం ప్రజలు విభజన గురించి కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి సారించారని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో టిడిపి, కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంటే సాధ్యం అవుతుందనే అభిప్రాయం జనంలోకి తీసుకు వెళితే రెండు పార్టీలకు ప్రయోజన కరంగా ఉంటుందని ఇంకొందరు చెబుతున్నారు. పొత్తు వల్ల రెండు పార్టీలకు ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. ఏ పార్టీ అయినా తమ పార్టీకి ప్రయోజనం లేకుంటే పొత్తు పెట్టుకోదని, పొత్తు వల్ల కొంత నష్టం ఉంటుంది, కొంత లాభం ఉంటుందని సీనియర్లు అంటున్నారు.
మరోవైపు, ఎన్డీయేలోకి కొత్తగా పుట్టుకు వచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ టిడిపి - బిజెపిల వైపుకు ఉండటం ఆ పార్టీలకు కచ్చితంగా లాభించేదే. అయితే, పవన్ ఎన్ని సీట్లు కోరుతారు, ఎక్కడెక్కడ కోరుతారనే విషయమై ఇంకా స్పష్టత లేదు. పవన్ వంటి గ్లామర్ కలిగిన నాయకుడు తమ వైపుకు వస్తే ఆ పార్టీలు అక్కున చేర్చుకుంటాయి. పవన్ అడిగిన సీట్లు దాదాపు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చునంటున్నారు.












Click it and Unblock the Notifications