ys jagan key decisions schemes women girls మహిళా దినోత్సవం వైయస్ జగన్ కీలక నిర్ణయాలు పథకాలు మహిళలు బాలికలు
మహిళా దినోత్సవం నాడు జెండర్ బడ్జెట్ తో పాటు కీలక నిర్ణయాలు ప్రకటించిన సీఎం వైఎస్ జగన్
ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. మహిళా హెల్ప్ డెస్క్ లను , దిశ కియోస్క్ యంత్రాలను ప్రారంభించారు. సచివాలయంలో మహిళల వేధింపుల నివారణ కమిటీని వేస్తామని , ప్రతి ప్రైవేటు ప్రభుత్వ కార్యాలయాలలో మహిళా కమిటీ తప్పక ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

తొలిసారిగా ఈ ఏడాది బడ్జెట్లో జెండర్ బడ్జెట్ కాన్సెప్ట్
మహిళలకు ఆర్థిక , రాజకీయ , సామాజిక సాధికారత కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించిన సీఎం జగన్, తొలిసారిగా ఈ ఏడాది బడ్జెట్లో జెండర్ బడ్జెట్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అక్కాచెల్లెళ్లకు తోడుగా, అండగా ప్రభుత్వం ఉందని చెబుతూ జెండర్ బడ్జెట్ ను తీసుకువస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. బడ్జెట్లో అక్కాచెల్లెళ్ల కోసం ఎంత ఖర్చు చేస్తున్నామని వివరాలను వచ్చే బడ్జెట్లో ప్రవేశపెడుతున్నామని పేర్కొన్న జగన్ మహిళల కోసం ప్రభుత్వం ఏ పథకాల ద్వారా ఎంత మొత్తం ఖర్చు చేస్తుందని వివరాలతో బడ్జెట్ ను ప్రవేశ పెడతామని పేర్కొన్నారు.

ఆడపిల్లలు చదువుకోవాలనే అమ్మ ఒడి , ఇంగ్లిష్ మీడియం చదువులు
రేపటి తరం చిన్నారులకు కూడా సింహభాగం పథకాలు ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల్లో అక్షరాస్యత 2011 జనాభా లెక్కల ప్రకారం కేవలం 60 శాతం మాత్రమే ఉంది అన్న జగన్ ఇప్పటికి 40 శాతం మహిళలు చదువులకు దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. అన్ని అంశాల్లోనూ స్త్రీల పట్ల సమాజంలో వివక్ష ఇంకా కొనసాగుతుందన్న జగన్ దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఆడపిల్లలు కూడా చదువుకోవాలన్న ఉద్దేశంతో, చదువుకు దూరం కాకూడదని సంకల్పంతో అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చామని జగన్ పేర్కొన్నారు. ఆడపిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువులు గొప్పగా చదవాలని పథకాలు తీసుకు వచ్చామని చెప్పారు.

ప్రతి ఇంట్లో మహిళల సేవలకు ఆర్ధిక కొలమానం లేదు
మహిళ అంటే ఆకాశంలో సగం , సృష్టిలో సగ భాగం అంటున్నాం కానీ ఆ సగభాగం వారికి ఇస్తున్నామా అనేది అంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని జగన్ పేర్కొన్నారు. దేశంలో ప్రతి పనిలోనూ మహిళలు కనిపిస్తున్నారని, దేశం గర్వించేలా డ్వాక్రా ఉద్యమంలో కూడా మహిళలు క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్నారని, ఇంటిని తీర్చిదిద్దడంలో మహిళల పాత్ర గణనీయమైనది అని సీఎం జగన్ మహిళామణులకు కితాబిచ్చారు. భూదేవికి ఉన్నంత సహనంతో ప్రతి ఇంట్లోనూ మహిళా మూర్తులు అందిస్తున్న సేవలకు ఎలాంటి ఆర్థిక కొలమానాలు లేవని జగన్ స్పష్టం చేశారు .

అక్కాచెల్లెళ్ల రక్షణ కోసం చట్టం చేసిన ప్రభుత్వం మనదే
అక్క చెల్లెల రక్షణ కోసం చట్టం చేసిన ప్రభుత్వం ఏపీ ప్రభుత్వమని గర్వంగా చెబుతున్నా అని సీఎం జగన్ పేర్కొన్నారు. మహిళలకు ఎవరైనా అన్యాయం చేస్తే బుద్ధి చెప్పేందుకు 18 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, ప్రతి జిల్లాకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లను , కోర్టులను ఏర్పాటు చేశామని జగన్ తెలిపారు . మహిళలపై నేరాలను 7.5 శాతానికి తగ్గించగలిగే పేర్కొన్న జగన్ నేరాల దర్యాప్తు 100 రోజుల నుంచి యాభై మూడు రోజులకు తగ్గించామని వెల్లడించారు.

ఏపీ సర్కార్ .. మహిళలకు ప్రతి పనిలోనూ అండగా ఉంది
మహిళా ఉద్యోగులకు 15 సిఎల్ లను 20 రోజులకు పెంచుతూ ప్రకటన చేశామని , ఇక పాఠశాల విద్యార్థుల కోసం బయోడిగ్రేడబుల్ సానిటరీ నాప్కిన్స్ ను అందిస్తున్నామని, చేయూత కిరాణా దుకాణాలలో తక్కువ ధరలకే నాప్కిన్స్ అందిస్తామని తెలియజేశారు . అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థినుల కోసం ల్యాప్ టాప్ లను అందిస్తున్నామని చెప్పారు . ఏపీ ప్రభుత్వం ప్రతి కార్యక్రమంలోనూ, ప్రతి పథకం ద్వారా ఏపీ లోని అక్కాచెల్లెళ్లకు అండగా నిలుస్తుందని జగన్ స్పష్టం చేశారు.