వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లు వీరే- జగన్ తొలి అడుగు
YS Jagan Mohan Reddy: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం క్రమంగా కోలుకుంటోంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే మంగళగిరి వంటి కీలక నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమించింది.
పాత నాయకులు..
తాజాగా రీజినల్ కోఆర్డినేటర్లను అపాయింట్ చేసింది వైఎస్ఆర్సీపీ. పార్టీ సీనియర్ నేతలకు ఆ బాధ్యతలను అప్పగించింది. భారీగా మార్పులు చేర్పులు చేసింది. ఎన్నికలకు ముందు ఈ హోదాలో పని చేసిన వాళ్లలో కొందరిని కొనసాగించినప్పటికీ- వాళ్లు పర్యవేక్షించిన ప్రాంతాలు మారాయి.

సాయిరెడ్డి చేతికి ఉత్తరాంధ్ర..
కీలకమైన ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డిని తప్పించారు. ఆ స్థానంలో మళ్లీ ఎంపీ విజయసాయి రెడ్డినే అపాయింట్ చేశారు. గతంలో ఇదే ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ సమన్వయకుడిగా సాయిరెడ్డి వ్యవహరించిన విషయం తెలిసిందే.
వైవీ సుబ్బారెడ్డికి చిత్తూరు, గుంటూరు
తాజాగా చోటు చేసుకున్న మార్పులు చేర్పుల్లో వైవీకి ఉమ్మడి చిత్తూరు, గుంటూరు జిల్లాల సమన్వయ బాధ్యతలు దక్కాయి. ఉమ్మడి అనంతపురం, నెల్లూరు జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతలు రాజంపేట లోక్‌సభ సభ్యుడు పీవీ మిథున్ రెడ్డికి లభించాయి. గతంలో ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు సమన్వయకుడిగా వ్యవహరించారు.

బొత్సకు గోదావరి..
ఇప్పుడు అవే ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్‌గా మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అపాయింట్ అయ్యారు. కాపు, క్షత్రియ సామాజిక వర్గం ఓటుబ్యాంక్ అత్యంత బలంగా ఉన్న జిల్లాలు కావడంతో బొత్సకు ఈ బాధ్యతలను అప్పగించారు వైఎస్ జగన్.
ప్రకాశం జిల్లా మాజీ మంత్రికి..
అధికార తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి అప్పగించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రాంతీయ సమన్వయకుడిగా మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నియమితులయ్యారు.

కడప గడపలో పెద్దిరెడ్డి
మాజీ మంత్రి, పుంగనూరు శాసన సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉమ్మడి కడప, కర్నూలు జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతలు లభించాయి. ఈ రెండు ఉమ్మడి జిల్లాలు కూడా వైఎస్ఆర్సీపీ కంచుకోటగా ఉంటూ వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నది.
జమిలి వైపు అడుగు..
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి.. వన్ నేషన్- వన్ ఎలక్షన్ కాన్సెప్ట్‌ను తెర మీదికి తీసుకొచ్చిన నేపథ్యంలో దేశంలో జమిలి ఎన్నికలు జరగొచ్చంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఇప్పటినుంచే పార్టీ బలోపేతంపై వైఎస్ జగన్ దృష్టి సారించినట్టయింది.












Click it and Unblock the Notifications