జగన్ మారిస్తే ఏంచేస్తాం, సిఎం కూడా చెప్పారు: టిపై డిగ్గీ
న్యూఢిల్లీ: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తమ పార్టీకి ఎంతో చేశారని, ఆయన తనయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే తనకు కొడుకులాంటి వాడని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ బుధవారం న్యూఢిల్లీలో అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ఇరువురు నేతలు విభజన నిర్ణయం తీరును నిరసిస్తూ దీక్షలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని, తాము అనుకూలంగా ఉన్నామని లేఖ ఇచ్చిన జగన్, బాబులు ఇప్పుడు మాట మారిస్తే ఏం చేస్తామని ప్రశ్నించారు.

తమ పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల నేతలు కూడా నిర్ణయం తీసుకోవాలని తమను కోరారన్నారు. తమ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అందరు కాంగ్రెసు నేతలు చెప్పారన్నారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తామని ముఖ్యమంత్రి కూడా చెప్పారన్నారు.
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు తన రాజీనామాను ఆమోదించే అంశంపై న్యాయస్థానానికి వెళ్లే హక్కు ఉందన్నారు. తాను ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడినట్లు చెప్పారు. ఎపిఎన్జీవోలతో చర్చలు కొనసాగుతున్నాయని, అత్యవసర సేవలను పునరుద్దరిస్తామని చెప్పారని తెలిపారు.












Click it and Unblock the Notifications