మంచి పాలకుడే!: నరేంద్రమోడీకి జగన్ కితాబు, హితవు
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. జగన్ శనివారం లోటస్ పాండులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీపై మండిపడ్డారు.
అదే సమయంలో మోడీని ప్రశంసించారు. అదే సమయంలో మోడీకి హితవు పలికారు. బిజెపిని మార్చాలని, దానిని లౌకికవాద పార్టీగా తీర్చిదిద్దాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం ద్వారా తాను మంచి పరిపాలకుడిని అని ఆయన నిరూపించుకున్నారని చెప్పారు.

"ఒక రాజకీయ నాయకుడు ఒక రాష్ట్రంలో మూడుసార్లు వరుసగా విజయం సాధించాడనుకోండి. అతడు మంచివాడని అర్థం కాదా? బిజెపిని లౌకికవాద పార్టీగా చేయాలని మోడీని కోరుతున్నాను. మోడీ కనక బిజెపి వైఖరిని మారిస్తే దానిని లౌకికవాద పార్టీగా చేస్తే మరింతమంది దానికి మద్దతు ఇస్తారు'' అని వ్యాఖ్యానించారు.
తద్వారా, బిజెపి లౌకికవాద పార్టీ అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. తమకు ముజఫర్‌నగర్లు వద్దని, మాకు మొహబ్బత్ (ప్రేమ) నగర్లు కావాలన్నారు.
నీ కొడుకును ప్రధానిని చేయడం కోసం తెలుగు బిడ్డల జీవితాలతో చెలగాటం ఆడొద్దని, ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించడం దారుణమని, రాహుల్ గాంధీ సహా పార్లమెంటులోని పార్టీల నేతలు ఎవరూ దీనిని అంగీకరించవద్దని, ఎన్నికలకు కొద్ది నెలల ముందు కేవలం ఓట్ల కోసం రాష్ట్రాన్ని విభజించడం దారుణమని, అలా జరిగితే భవిష్యత్తులో కేవలం ఓట్ల కోసమే రాష్ట్రాలను ముక్కలు చేసేస్తారని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి వద్ద ఉన్న ఆర్డినెన్స్‌నే వెనక్కి తీసుకున్న యూపిఏకి కేబినెట్ నోట్‌ను ఉపసంహరించుకోవడం పెద్ద సమస్య కాదన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేయాలన్న సంప్రదాయాన్ని కాంగ్రెస్ వదిలేసిందని, నిరంకుశంగా, ఏకపక్షంగా విభజిస్తోందని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications