'సిబిఐ తీర్పు వస్తే చంచల్‌గూడకు జగన్, ఈడీ తీర్పు వస్తే తీహార్'
నెల్లూరు/విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ఫోర్సుమెంట్ డిపార్టుమెంట్ (ఈడీ) తీర్పు వస్తే జగన్ తీహార్ జైలుకు వెళ్తారని, సిబిఐ తీర్పు వస్తే చంచల్ గూడ జైలుకు వెళ్తారని చెప్పారు.
దేశంలో ఏ నాయకుడు కోర్టు ఆవరణలో ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. జగన్ మాత్రం శుక్రవారం కోర్టు ఆవరణలోనే ఎమ్మెల్యేలతో మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఈడీ తీర్పు వస్తే తీహార్ జైలు జగన్‌కు ఖాయమన్నారు. సిబిఐ తీర్పు వస్తే మాత్రం చంచల్‌గూడ జైలుకు వెళ్తారన్నారు.
తమ ప్రభుత్వానికి మెజార్టీ ఉందని, వైసిపి ఎమ్మెల్యేలను బలవంతంగా లాక్కోవడం లేదని చెప్పారు. చంద్రబాబు అభివృద్ధిని చూసి, అలాగే జగన్ తీరు భరించలేక వైసిపి ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారని వర్ల రామయ్య చెప్పారు.

ఇంత ఆనందం ఎప్పుడు కలగలేదు: బాలకృష్ణ
లేపాక్షి ఉత్సవాల నిర్వహణలో కలిగిన ఆనందం తనకు జీవితంలో ఎప్పుడూ కలగలేదని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా పోటీకి నిలిచినప్పుడు ఎన్నో విమర్శలు చేశారన్నారు. వారందరికీ ఇదే తన సమాధానం అన్నారు. లేపాక్షి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా బాలకృష్ణ ఉద్వేగంగా మాట్లాడారు.
ఆనం వివేకా ఫిర్యాదు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. వైసిపి ఎమ్మెల్యేలకు, ఆనం వివేకాకు మధ్య వైరం ముదిరింది. వీరి పంచాయతీ ఇప్పుడు చంద్రబాబు వద్దకు వెళ్లింది. నకిలీ మద్యం వ్యవహారంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డిల పేర్లను చేర్చాలని సీఎం చంద్రబాబుకు ఆనం వివేకా వినతి పత్రం ఇచ్చారు. నకిలీ మద్యం వెనుక వైసిపి నేతల హస్తముందన్నారు.












Click it and Unblock the Notifications