పవన్ కల్యాణ్ గురి పెట్టారు, కానీ - అక్కడ గెలుపు సాధ్యమేనా..!!
ఏపీలో పలు నియోజకవర్గాల్లో ఆసక్తి కర పోరు తప్పేలా లేదు. గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన కలిసి వైసీపీని దెబ్బ తీయాలని భావిస్తున్నాయి. బీజేపీ కలవటం ఖాయం కావటంతో మరింత బలం పెరుగుతందని అంచనా వేస్తున్నాయి. గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు రానీయమని పవన్ శపథం చేసారు. కాకినాడ రూరల్ లో మాజీ మంత్రి కన్నబాబు వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. టీడీపీ, జనసేన నుంచి అభ్యర్ది పైన నిర్ణయం జరగాల్సి ఉంది. నియోజకవర్గంలో గెలుపు ఎవరిదనేది ఆసక్తి కరంగా మారుతోంది.
పొత్తుల్లో దక్కేదెవరికి:టీడీపీ, జనసేన పొత్తుతో తూర్పు గోదావరిలో మెజార్టీ స్థానాలు గెలుస్తామని రెండు పార్టీలు ధీమాతో ఉన్నాయి. సామాజిక సమీకరణాలే అస్త్రాలుగా జగన్ ఎన్నికల రంగంలోకి దిగారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్దిగా మాజీ మంత్రి కన్నబాబు తిరిగి అభ్యర్దిగా పోటీ చేస్తున్నారు. ఈ సీటు కోసం టీడీపీ, జనసేన నుంచి పోటీ నెలకొంది. జనసేన అభ్యర్దిగా పంతం నానాజీ సీటు ఆశిస్తున్నా టీడీపీ నుంచి ఒత్తిడి కనిపిస్తోంది. నియోజకవర్గంలో కాపులు, శెట్టి బలిజ సామాజిక వర్గాలు గెలుపు ఓటమలును ప్రభావితం చేయనున్నాయి. ఈ లెక్కలే ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య అభ్యర్ది ఎంపిక లో కలకంగా మారాయి. ఈ నియోజకవర్గంలో కన్నబాబు ఇప్పటికే రెండు పర్యయాలు గెలుపొందారు.

హోరా హోరీ పోరు:చిరంజీవితో కన్నబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రజారాజ్యం నుంచి గెలిచిన సమయంలో కలిసి పని చేసిన నేతలే ఇప్పుడు జనసేనలో ఉన్నారు. కాకినాడ రూరల్ సీటు జనసేన ఆశిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన నుంచి సీటు ఆశిస్తున్న పంతం నానాజీ పార్టీలో సీనియర్ అయినా స్థానికంగా టీడీపీ నేతల నుంచి పోటీ ఎదుర్కొంటున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ కాకినాడ వేదికగా పార్లమెంట్ పరిధిలోని ప్రతీ సీటులో బలం - బలహీనతల పైన పూర్తి సమాచారం సేకరించారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తిరిగి సీటు ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో కాపు వర్గానికి 42 వేల ఓట్లు ఉంటే, శెట్టి బలిజ వర్గానికి దాదాపు 60 వేల ఓట్లు వరకు ఉన్నట్లు తాజాగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
సమీకరణాలే కీలకం:తాజాగా టీడీపీలో చేరిన శెట్టి బలిజ యువ నేత ఇక్కడ సీటు ఆశిస్తున్నారు. ఇక్కడ సీటుకు ప్రకటన తరువాత రెండు పార్టీల మథ్య సమన్వయం గెలుపు ఓటములను డిసైడ్ చేయనుంది. పిల్లి అనంతలక్ష్మి వర్గం తాము సీటు కోసం అడగమని..ఇస్తే చేస్తామని, లేకుంటే అప్పుడు నిర్ణయం ప్రకటిస్తామని చెబుతున్నారు. కన్నబాబు పూర్తిగా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు, జగన్ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలే తనకు కలిసి వస్తాయనే ఆశతో ఉన్నారు. ఇక్కడ కూటమి అభ్యర్ది ఖరారు తరువాత అసలు రాజకీయం ప్రారంభం కానుంది. ఈ నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలనేది పవన్ కల్యాణ్ లక్ష్యం. మరి.. వైసీపీ సైతం ఈ సీటును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వేళ..ఇక్కడి ఫలితం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications