ఏఐతో 2 గంటల్లో శ్రీవారి దర్శనమా ? మరి కొత్త క్యూకాంప్లెక్స్ ఎందుకు?
ఏపీలో తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తిరుమలకు వచ్చే భక్తులకు ప్రస్తుతం ఉన్న సుదీర్ఘ వెయిటింగ్ కాలాన్ని తగ్గిస్తూ ఏఐ వాడకంతో కేవలం రెండు గంటల్లోనే దర్శనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు చేసిన ప్రకటన సంచలనం రేపింది. దీనిపై ఇప్పటికే టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రమణ్యం వంటి వారు అసాధ్యమని చెప్పగా.. బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు.
ఈ నేపథ్యంలో ఇవాళ వైసీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఏఐతో రెండు గంట్లలో శ్రీవారి దర్శనం అంటూ బోర్డు ఊదరగొట్టడాన్ని తప్పుబట్టారు. తిరుమలలో ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లోనే భక్తులకు శ్రీవారి దర్శనం అంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేస్తున్నదంతా ప్రచార ఆర్భాటమేనని భూమన మండిపడ్డారు. ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం అంటూ మాట్లాడుతున్న చైర్మన్ శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం ఉన్న రెండు క్యూ కాంప్లెక్స్ లు సరిపోవడం లేదని మూడో క్యూ కాంప్లెక్స్‌కు పాలకమండిలో ఎలా నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

ఇప్పటికే ఉచితంగా మాకు ఏఐ టెక్నాలజీని ఇచ్చేందుకు ముందుకు వచ్చారంటూ గూగుల్, టీసీఎస్ ప్రతినిధులకు కొండపైన గెస్ట్‌హౌస్‌లను కేటాయించడం, టీటీడీ వాహనాలను వాడుకునేందుకు అనుమతించడం, టీటీడీ సిబ్బందిని కేటాయించడం ఎలా చేస్తున్నారని భూమన ప్రశ్నించారు. ఆ సంస్థల ఉద్యోగులకు టీటీడీ ఖర్చుతో వాహనాలను ఎలా అందిస్తున్నారో చెప్పాలన్నారు. తొమ్మిది నెలలుగా ఏఐ టెక్నాలజీని తీసుకువస్తున్నామంటూ ఆయన పదవీ కాలం ముగిసే వరకూ ఇదే చెబుతూ కాలక్షేపం చేస్తారా అని అడిగారు.

ప్రతిరోజూ దాదాపు లక్ష మంది భక్తులు వచ్చే టీటీడీలో భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించాల్సిన టీటీడీ చైర్మన్ తన ప్రచారం కోసం, పరస్పర విరుద్దమైన నిర్ణయాలను ఎలా తీసుకుంటారని భూమన ప్రశ్నించారు. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగానే భక్తుల దర్శన ఏర్పాట్లు ఉండాలే కానీ, ఏఐ పేరుతో కొత్త విధానాలను ఆలయంలో ప్రవేశపెట్టడంపై హైందవధర్మ పరిరక్షకుల సలహాలను ఎక్కడా తీసుకోలేదని విమర్శించారు.












Click it and Unblock the Notifications