స్కాంల బాబూ!, దమ్ముంటే మాతో రండి: రాజీనామాలపై తగ్గమన్న వైవీ సుబ్బారెడ్డి
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శనివారం మాట్లాడుతూ.. చంద్రబాబుకు చెప్పకుండానే టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని కలిశారా? అని ప్రశ్నించారు.
Recommended Video

నాలుగేళ్లుగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా కేంద్రంతో లాలూచీ పడుతున్నారని ఆయన ఆరోపించారు.

అవిశ్వాసానికి మద్దతు
మంగళవారం అవిశ్వాసానికి నోటిసిచ్చామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా అవిశ్వాస నోటిసిచ్చిందని తెలిపారు. ఎవరి అవిశ్వాసం చర్చకు వచ్చినా మద్దతిస్తామని వైవీ తెలిపారు. సోమవారం పార్టీ అధినేత జగన్ ఆధ్వర్యంలో సమావేశమవుతామని చెప్పారు.

బాబుది స్కాంల రాజకీయం
టీడీపీ డ్రామాల పార్టీ అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెబుతున్నారని వైవీ వ్యాఖ్యానించారు. అవకతవకలు, అవినీతి జరిగిందని సోము వీర్రాజు కాగ్ నివేదికలు చూపిస్తుంటే.. ఏపీ ప్రభుత్వం విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. నీరు-చెట్టు, మట్టి, ఆఖరికి స్కూల్ బాత్రూంలు శుభ్రం చేసే పనిలోనూ అవినీతికి పాల్పడ్డారని ఏపీ సర్కారుపై ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు 40ఏళ్ల రాజకీయ జీవితంలో అన్ని స్కాంలేనని అన్నారు.

హోదాపై కోర్టుకు వెళతారట..?
హోదా కోసం కోర్టు పోతామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. హోదా కాదని, ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారని.. కోర్టు అడిగితే చంద్రబాబు ఏం సమధానమని ప్రశ్నించారు. చంద్రబాబు మొదట్నుంచి హోదా కోసం పోరాడితే ఇప్పటికే వచ్చి ఉండేదని అన్నారు.

హోదాను తాకట్టు పెట్టి..
తమ పార్టీ ఐదుగురు ఎంపీలు ఏపీ ప్రజల గళం వినిపిస్తున్నారని చెప్పారు. జగన్ సూచన మేరకు అన్ని పార్టీల మద్దతు కోరుతున్నామని చెప్పారు. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు ఆడుతున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇప్పటికి కూడా బీజేపీతో కలిసి ఉండమని చంద్రబాబు చెప్పడం లేదని అన్నారు. కేంద్రమంత్రులను టీడీపీ ఎంపీలు ఇప్పటికీ కలుస్తూనే ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో పోరాడాలని అన్నారు.

దమ్ముంటే మాతో రండి..
ఏప్రిల్ 6న తాము రాజీనామా చేస్తామని, దమ్ముంటే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. అందరూ రాజీనామా చేస్తే కేంద్రం ఖచ్చితంగా దిగివస్తుందని, హామీలను అమలు చేస్తుందని చెప్పారు. డ్రామాలొద్దు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని టీడీపీకి ఆయన సూచించారు. చంద్రబాబు.. రాజకీయ ప్రయోజనాలు కోరే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారని అమిత్ షా కూడా చెప్పారని వైవీ అన్నారు.












Click it and Unblock the Notifications