నిజాం వారసుడిగా అజ్మత్ జా: హాలీవుడ్ దిగ్గజ దర్శకులతోనూ పని చేశారీయన
హైదరాబాద్: నిజాం వారసుడిగా మీర్ మహ్మద్ అజ్మత్ అలీఖాన్ అజ్మత్ జా ఎంపికయ్యారు. ప్రిన్స్ ముకర్రమ్ జా మృతి అనంతరం ఆయన వారసుడిగా అజ్మత్ జాను ఎంపిక చేశామని కుటుంబసభ్యులు తెలిపారు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు కుటుంబసభ్యులు, సన్నిహితులు, నిజాం ట్రస్టీల మధ్య సంప్రదాయ పద్ధతిలో ఈ ప్రక్రియ నిర్వహించామని చౌమహల్లా ప్యాలెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
నిజాం చివరి వారసుడు నిజాం ప్రిన్స్‌గా పేరొందిన ముకర్రం జా వారం రోజు క్రితం మరణించడంతో ఆయన కుమారుడు అజ్మత్ జాను వారసుడిగా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. 1960లో జన్మించిన అజ్మత్ జా లండన్‌లోనే ప్రాథమిక, ఉన్నత విద్యనభ్యసించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి ఫొటోగ్రఫీ పట్టా పొందారు. ఫొటోగ్రఫీని వృత్తిగా ఎంచుకున్నారు.

హాలీవుడ్‌లో కొన్ని సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ విధులు నిర్వహించారు. హాలీవుడ్ దిగ్గజ దర్శకులు స్టీవెన్ స్పీల్‌బర్గ్, రిచర్డ్ అటెన్‍బరోలతో కలిసి పనిచేశారు. పలు షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు చిత్రీకరించారు. లండన్‌లోని నివాసం ఉంటున్నప్పటికీ.. తన వ్యాపారాలు, డాక్యుమెంటరీ చిత్రీకరణల కోసం పలు దేశాలకు తరచూ రాకపోకలు సాగిస్తుంటారు.
తండ్రి ముకర్రం జా అంత్యక్రియలు పూర్తి చేయడం కోసం వారం రోజుల కిందట హైదరాబాద్ వచ్చిన అజ్మత్ జా ప్రస్తుతం పాతబస్తీలోని తన పూర్వీకుల నివాసంలో ఉంటున్నారు. కాగా, ముకర్రం జా టర్కీలో మరణించిన విషయం తెలిసిందే. అక్కడ్నుంచి ఆయన పార్థీవ దేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications