hyderabad telangana dgp mahender reddy kcr Coronavirus హైదరాబాద్ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కేసీఆర్
లాక్‌డౌన్ మరింత కఠినం, అడ్రస్ ప్రూఫ్స్ వెంటే ఉండాలి: మే 7పై ప్రజలే తేల్చుకోవాలి!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ మే 7 వరకు పొడిగించిన నేపథ్యంలో దాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. లాక్‌డౌన్ అమలుపై సీనియర్ అధికారులతో సమావేశమై చర్చించామని తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మహేందర్ రెడ్డి మాట్లాడారు.

అవసరం ఉన్నవాళ్లకు మాత్రమే..
అత్యవసర సేవల కోసం ఇప్పటి వరకు ఇచ్చిన పాసులను సమీక్షించాలని నిర్ణయించినట్లు డీజీపీ తెలిపారు. పాసులను దుర్వినియోగం చేసినట్లు, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అవసరం ఉన్నవాళ్లకు మాత్రమే పాసులు ఇస్తామని, సమయం, ప్రయాణించే మార్గం కూడా నిర్ణయించేలా కొత్త పాసులు ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాసులు అప్పటి వరకు కొనసాగుతాయన్నారు.

అడ్రస్ ప్రూఫ్స్ వెంట ఉండాలి..
నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు వెళ్లేవారు 3 కి.మీ దాటకూడదని డీజీపీ స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాంపై ఒకరు, కారులో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని, ఇకపై స్థానిక అడ్రస్ ప్రూఫ్‌ను వెంట తీసుకుని రావాలని తెలిపారు. ఆస్పత్రులకు వెళ్లేవారు దగ్గర్లోని ఆస్పత్రులకే వెళ్లాలని, వారు కూడా అడ్రస్ ప్రూఫ్ తీసుకుని వెళ్లాలని సూచించారు. దూరంగా ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తే గతంలో సంబంధిత ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికలు వెంటే తీసుకెళ్లాలన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు కలర్ పాస్‌లు..
కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్తున్నందుకు వారికి కలర్ కోడ్ ప్రకారం పాసులు ఇవ్వాలని సంబంధిత కార్యాలయాలను కోరుతామని చెప్పారు. దీనిపై సీఎస్ కు కూడా లేఖ రాస్తామన్నారు. సోమవారం రెడ్, మంగళవారం గ్రీన్, బుధవారం ఎల్లో, గురువారం వైట్, శుక్రవారం లైట్ పింక్, శనివారం బ్లూ కలర్స్ లో పాసులు ఇవ్వడంతోపాటు ఆయా ఉద్యోగులు ప్రయాణించే రూటును కూడా అందులో పొందుపర్చాలని సూచించారు. దీంతో పోలీసులకు వారిని గమనించడం సులభమవుతుందన్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిని కట్టడి చేసేందుకే ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

ప్రజలు సహకరిస్తే... లేదంటే..
రాష్ట్ర వ్యాప్తంగా 1.21 లక్షల వాహనాలను సీజ్ చేశామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆ వాహనాల యజమానులపై కేసులు నమోదు చేసి వాహనాలను కోర్టుల్లో డిపాజిట్ చేస్తామని తెలిపారు. యజమానులంతా లాక్ డౌన్ పూర్తయ్యాక వాటిని తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, లాక్ డౌన్ ఉల్లంఘిస్తూ పోతే పరిస్థితి ఇలాగే కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తే మే 7 నాటికి కరోనా కేసులు తగ్గి లాక్‌డౌన్ సడలించే అవకాశం ఉంటుందని డీజీపీ తెలిపారు.

పోలీసులు భేష్.. కేసీఆర్‌కు కృతజ్ఞతలు
ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి... ఇతరులకు వైరస్ సోకకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఫుడ్ డిస్టిబ్యూషన్ చేసే సమయంలో సోషల్ డిస్టెన్స్ ఉండేలా చూసుకోవాలన్నారు. ఎక్కువ సమస్యలు తలెత్తే విధంగా సూపర్ మార్కెట్లు వ్యవహరిస్తే సీజ్ చేస్తామని డీజీపీ హెచ్చరించారు. పోలీసులకు-ప్రభుత్వానికి కాలనీ రెసిడెన్షీ వెల్ఫేర్ అసోషియేషన్ సహకరించాలన్నారు. రెసిడెన్షీ అసోషియేషన్లలో ఒకే ఎంట్రీ-ఏక్సిట్ ఉండేలా చూసుకోవాలన్నారు. మర్కజ్ వెళ్లివచ్చినవారికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పోలీసు సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారని డీజీపీ అభినందించారు. పోలీసులకు వేతనంలో 10శాతం ప్రోత్సాహకంగా ప్రకటించడంపై సీఎం కేసీఆర్‌కు డీజీపీ మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.