ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు: రూట్ ఇదే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రం అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను మరింత విస్తరిస్తోంది. వాటి సంఖ్యను గణనీయంగా పెంచుతోంది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. ఇప్పటికే పలు రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
తాజాగా జమ్మూ కాశ్మీర్ లో కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించారు. చీనాబ్ నదిపై ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లాను అనుసంధానిస్తూ నిర్మించిన రైల్వే లింక్ బ్రిడ్జి మీదుగా ఈ రైలు పరుగులు పెట్టింది. ఫలితంగా- కాట్రా మీదుగా న్యూఢిల్లీ- జమ్మూ కాశ్మీర్ మధ్య నేరుగా రైలు కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది.

అదే సమయంలో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించింది రైల్వే శాఖ. ఒకటి శ్రీనగర్ నుండి- కాట్రా, ఇంకొకటి కాట్రా నుండి శ్రీనగర్‌కు నడుస్తుంది. వీటి వల్ల- ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన చారిత్రాత్మక వైష్ణోదేవి అమ్మవారి ఆలయాన్ని దర్శించే భక్తులకు రవాణా వసతిని మెరుగుపర్చినట్టయింది.
తాజాగా ఈ రెండు రైళ్ల షెడ్యూల్ ను నార్తరన్ రైల్వే విడుదల చేసింది. వారంలో ఆరు రోజుల పాటు ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. బుధవారం మినహా ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు శ్రీనగర్ నుంచి బయలుదేరే నంబర్ 26404 వందే భారత్ ఎక్స్ ప్రెస్.. 10:58 నిమిషాలకు శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా స్టేషన్ కు చేరుకుంటుంది.
తిరుగుప్రయాణంలో- అదే రోజు మధ్యాహ్నం 2:55 నిమిషాలకు కాట్రా నుంచి బయలుదేరే నంబర్ 06403 వందే భారత్ ఎక్స్ ప్రెస్.. సాయంత్రం 7:53 నిమిషాలకు శ్రీనగర్ కు చేరుకుంటుంది. బనిహాల్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఈ స్టేషన్ లో రెండు నిమిషాల పాటు హాల్ట్ అవుతుంది.
మంగళవారం మినహా ప్రతి రోజూ ఉదయం 8: 10 నిమిషాలకు శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా నుంచి బయలుదేరే నంబర్ 26401 వందే భారత్ ఎక్స్ ప్రెస్.. 11:08 నిమిషాలకు శ్రీనగర్ కు చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో- అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు శ్రీనగర్ నుంచి బయలుదేరే నంబర్ 06402 వందే భారత్ ఎక్స్ ప్రెస్.. సాయంత్రం 4:58 నిమిషాలకు కాట్రా చేరుకుంటుంది. బనిహాల్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.












Click it and Unblock the Notifications