కోడి కోసం వచ్చి బావిలో పడిన చిరుత పులి
బెంగళూరు: అటవీ ప్రాంతం నుండి ఆహారం కోసం వచ్చిన చిరుత బావిలో పడిపోయిన సంఘటన కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని బంట్వాళ దగ్గర ఉన్న వళలూరు గ్రామంలో జరిగింది. అటవీ శాఖ అధికారులు బుధవారం చిరుతను రక్షించి పులుల సంరక్షణా కేంద్రానికి (టైగర్ ఫారెస్ట్) తరలించారు.

వళలూరు గ్రామంలో లింగప్ప పూజారి నివాసం ఉంటున్నారు. ఈయన తన ఇంటి దగ్గర కోళ్లు పెంచుతున్నారు. ఇంటి సమీపంలో బావి ఉంది. మంగళవారం రాత్రి చిరుత అటవీ ప్రాంతం నుండి ఆహారం కోసం గ్రామానికి వచ్చింది. లింగప్ప ఇంటి సమీపంలో కోళ్లను తినడానికి ప్రయత్నించి.. ప్రమాదవశాత్తు 40 అడుగుల లోతు ఉన్న బావిలో పడింది.
బుధవారం ఉదయం బావిలోని నీటిలో తేలుతూ చిరుత గాండ్రించింది. బావిలో పులి ఉన్న విషయం గుర్తించిన లింగప్ప, గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అటవీ శాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

బావి చుట్టూ వల వేసి, వల కింద బోను ఏర్పాటు చేశారు. చిరుత బోనులోకి వెళ్తున్న సమయంలో మత్తుమందు ఇచ్చారు. ఆ తర్వాత చిరుత సృహ తప్పడంతో టైగర్ ఫారెస్ట్‌కు తీసుకు వెళ్లి వదిలేశారు.












Click it and Unblock the Notifications