అయోధ్య రామమందిరాన్ని సందర్శించే భక్తులు పాటించాల్సిన నియమ నిబంధనలు ఇవే
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవానికి ఎంతో సమయం లేదు. జనవరి 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. మూడు రోజుల పాటు పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.
Recommended Video

ప్రారంభోత్సవ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో నిర్మాణ పనులు వేగం పుంజుకొన్నాయి. మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారు. అయోధ్య జిల్లా అధికార యాంత్రంగం దీనిపై రోజూ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోంది.

ఈ నెల 15వ తేదీ నాడే రాములోరి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఆరంభమౌతాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్సవంగా దీన్ని నిర్వహించడానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆహ్వాన పత్రికలనూ పంపించింది. అయోధ్యలో ప్రతి ఇంటికీ రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలు అందాయి.
రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ జరుపుకొనే రామ్ లల్లా విగ్రహాల నిర్మాణం సైతం పూర్తయింది. శ్రీ ఆంజనేయ, లక్ష్మణ సమేత సీతారామచంద్రులవారి విగ్రహాలు అవి. మైసూరుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ వాటిని నిర్మించారు. అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహాలను రామమందిరంలో ప్రతిష్ఠించాలని తీర్థక్షేత్ర ట్రస్ట్..నిర్ణయించింది.
రామ మందిరాన్ని సందర్శించాలనుకునే భక్తులు పాటించాల్సిన నియమ నిబంధనలు విడుదల అయ్యాయి. రామ మందిరంలోనికి ప్రవేశించేటప్పుడు భక్తులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్‌ను పాటించాల్సి ఉంటుంది. ఆలయంలోనికి ప్రవేశించే సమయంలో భక్తులు సంప్రదాయ బద్ధమైన దుస్తులను ధరించాలి.

పురుషులు ధోతీ, గంచా, కుర్తా-పైజామాను ధరించాల్సి ఉంటుంది. మహిళలు- చీరె లేదా సల్వార్ సూట్స్/పంజాబీ డ్రెస్ ధరించవచ్చు. జీన్స్ ప్యాంట్స్/షర్ట్స్, టాప్స్, షార్ట్స్ లేదా పాశ్చాత్య శైలిని అనుకరించేలా ఉండే దుస్తులను ధరించి రామమందిరాన్ని సందర్శించే వెసలుబాటు లేదు.
భక్తులు తమ వెంట మొబైల్ ఫోన్లను తీసుకుని వెళ్లడాన్ని నిషేధించారు. పర్సులు, హ్యాండ్ బ్యాగులు, వాలెట్స్, ఇయర్ ఫోన్లు, హెడ్ ఫోన్లు, రిమోట్‌తో కూడిన కీ- చైన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఆలయంలోనికి తీసుకెళ్లకూడదు. గొడుగులు, బ్లాంకెట్లు, గురు పాదుకలను తీసుకెళ్లడంపైనా నిషేధం ఉంది.
ఈ మార్గదర్శకాలన్నీ కూడా ప్రస్తుతానికి రామమందిరం ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం వరకే పరిమితం చేశారు. మున్ముందు దీన్ని కొనసాగిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ప్రారంభోత్సవం రోజున ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉంది. సాధారణ భక్తులు ప్రారంభోత్సవం నాడు రామమందిరాన్ని నేరుగా సందర్శించలేరు.












Click it and Unblock the Notifications