ఉగ్ర వేట : జీలం నదిలో పాక్ ఉగ్రవాదులను ఛేజ్ చేస్తోన్న సైన్యం
కశ్మీర్ : యూరీ ఘటనానంతరం.. భారత్ సర్జికల్ స్ట్రైక్స్ తో పాక్ కు గట్టి బుద్ది చెప్పగా.. పద్దతి మార్చుకోని పాక్ మాత్రం పాత తీరునే కొనసాగిస్తోంది. తాజాగా ఆదివారం నాడు రాత్రి బారాముల్లా సమీపంలోని 46 రాష్ట్రీయ రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్ పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా, దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు సోమవారం తెల్లవారుఝామున జీలం నదిలో దూకి పారిపోతుండటాన్ని సైన్యం గుర్తించింది.

దీంతో వెంటనే అప్రమత్తమైన ఆర్మీ కమాండోలు భారీ కూంబింగ్ ఆపరేషన్ తో ఉగ్రవాదులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. జీలం నదిలో స్పీడ్ బోట్ల సహాయంతో ప్రస్తుతం ఉగ్ర వేట కొనసాగిస్తున్నారు కమాండోలు. దాడి తర్వాత జీపీఎస్, కాంపాస్, ఫెన్సింగ్ కట్టర్, ఏకే 47 మ్యాగజైన్ లను దాడి జరిగిన ప్రాంతంలోనే ఉగ్రవాదులు వదిలి వెళ్లడంతో సైన్యం వాటిని స్వాధీనం చేసుకుంది.
స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించిన అనంతరం ఉగ్రవాదులు పాక్ నుంచే చొరబడినట్టు సైనికాధికారులు గుర్తించారు. జీలం నదిని ఆనుకుని ఉన్న గ్రామాల్లోని ప్రజల నుంచి సేకరించిన సమాచారం మేరకు.. జీలం నది ద్వారా వారు పాక్ వైపు వెళుతున్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తోంది సైన్యం.












Click it and Unblock the Notifications