మమతకు షాక్: బిజెపిలో చేరిన నటి లాకెట్ ఛటర్జీ, టిఎంసిని వీడిన ఎంపి బోస్
కోల్‌కతా: బెంగాలీ నటి లాకెట్ ఛటర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. పశ్చిమబెంగాల్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రాహుల్ సిన్హా ఆధ్వర్యంలో ఆమె పార్టీలో చేరారు. పశ్చిమబెంగాల్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా పని చేస్తున్న ఆమె.. టిఎంసిని వీడిన నేపథ్యంలో ఆ పదవికి కూడా రాజీనామా చేశారు.
‘నేను టిఎంసిలో చేరిప్పుడు, నేను పని చేయాలనే కోరికతో ఉన్నా. అయితే పని చేయలేని పరిస్థితి అక్కడ ఉండటంతో తాను ప్రస్తుతం ఆ పార్టీని వీడుతున్నా' అని లాకెట్ ఛటర్జీ తెలిపారు. లాకెట్ ఛటర్జీ రాకతో తమ పార్టీకి మరింత బలం చేకూరుతుందని రాహుల్ సిన్హా చెప్పారు.
బంగోన్ లోకసభ, కిషన్‌గంజ్ అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో లాకెట్ ఛటర్జీ పార్టీ తరపున ప్రచారం చేస్తారని ఆయన తెలిపారు. టిఎంసి అవినీతిలో భాగస్వాములు కానీ నేతలందరూ తమ పార్టీలో చేరుతున్నారని రాహుల్ చెప్పారు.

టిఎంసికి రాజీనామా చేసిన ఎంపి శృంజోయ్ బోస్
శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో నిందితుడు, రాజ్యసభసభ్యుడు శృంజోయ్ బోస్ గురువారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. షరతులతో కూడిన బెయిలుపై విడుదలైన ఆయన, మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆయన 75 రోజులపాటు జూడిషియల్ కస్టడీలో ఉన్నారు. శారదా కుంభకోణంలో సిబిఐ శృంజోయ్ బోస్‌ను నవంబర్ 21, 2014లో అరెస్ట్ చేసింది. ఆయన బుధవారం బెయిలుపై విడుదలయ్యారు. శృంజోయ్ బోస్ మాట్లాడుతూ.. తాను తన ఎంపి పదవికి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని చెప్పారు.
అటు లాకెట్ ఛటర్జీ, ఇటు శృంజోయ్ బోస్ పార్టీని వీడటంతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి డబుల్ షాక్ తగిలినట్లయింది.












Click it and Unblock the Notifications