ఒక్క మోడీపై కేజ్రీ టు మమత: ఎవరి లెక్కలు వారివి
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీలు మూకుమ్మడిగా ప్రధాని నరేంద్ర మోడీ పైన పడ్డాయి. బీహార్ ప్రజలు.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను ఎన్నుకోవాలని ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీలు, పార్టీల అధినేతలు కోరుతున్నారు.
ఒక్క.. ప్రధాని మోడీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ఒంటి చేత్తో బిజెపిని గెలిపించారు. ఎన్డీయే కూటమి లేకుండానే బిజెపి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు సంపాదించేలా చేశారు. అయినప్పటికీ మిత్ర ధర్మం పాటించి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో మోడీకి గట్టి షాక్ తగలింది. దీంతో, బీహార్ ఎన్నికలు ప్రధాని మోడీ పరపతికి సంబంధించినవి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని దెబ్బతీసేందుకు అందరూ ఏకమవుతున్నారు. ఇందుకు ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి.
నితీష్ కుమార్ - లాలూ ప్రసాద్ యాదవ్ - కాంగ్రెస్ పార్టీ (మహాకూటమి)ని గెలిపించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు బీహార్ ప్రజలకు సూచిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా హైదరాబాదులో పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలులో మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా కేంద్రం హామీ నిలబెట్టుకోలేదని, అలాగే బీహార్ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే బీహారీలకు ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోరని ఏపీ కాంగ్రెస్.. రెండు రోజుల క్రితం పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రచారం చేశారు.
ఇక, కేజ్రీవాల్ మొదటి నుంచి కాంగ్రెస్, బిజెపి వ్యతిరేకిగా ఉన్నారు. అవినీతిని దరికి రానివ్వమని చెబుతున్నారు. కానీ బీహార్లో మాత్రం కాంగ్రెస్, అవినీతి మరక అంటుకున్న లాలూతో జతకలిసిన నితీష్‌కు ఓటు వేయమని చెబుతున్నారు. అందుకు కారణాలు లేకపోలేదని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎలాగు దెబ్బతిన్నదని, మిగిలింది మోడీ హవా తగ్గించడమేనని, అందులో భాగంగానే కేజ్రీవాల్.. నితీష్ కుమార్‌కు మద్దతిస్తున్నారని చెబుతున్నారు. ఇక, పశ్చిమ బెంగాల్లో ఇన్నాళ్లు మమత నేతృత్వంలోని తృణమూల్ వర్సెస్ సిపిఎంగా ఉండేది.
ఇప్పుడు బిజెపి కూడా మమతా బెనర్జీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బెంగాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా మోడీ హవా తగ్గితే.. ఆ ప్రభావం బెంగాల్ ఎన్నికల్లోను ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో దెబ్బతిన్న మోడీకి.. బీహార్ ద్వారా మరో షాక్ ఇవ్వాలని పలు పార్టీలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications