నువ్వు వస్తానంటే.... నేను వద్దంటానా ?, గాలి ఇంటికి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే !
బెంగళూరు/బళ్లారి/చిత్రదుర్గా: గుజరాత్ తరహాలో ప్రయోగాలు చెయ్యాలని అనుకుంటున్న బీజేపీ హైకమాండ్ కు కర్ణాటక లెవల్లే సినిమా చూపించాలని బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరు డిసైడ్ అయ్యారు. ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కని బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరు రెబల్స్ గా మారిపోతున్నారు. మాజీ మంత్రి, హోసదుర్గా సిట్టింగ్ ఎమ్మెల్యే గూలిహట్టి శేఖర్ గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి పరుగు తియ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
మంగళవారం రాత్రి బీజేపీ హైకమాండ్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 189 మంది అభ్యర్థులు మొదటి జాబితా విడుదల చేసింది. మొదటి జాబితాలో మాజీ సీఎం జగదీష్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రులు కేఎస్. ఈశ్వరప్ప, లక్ష్మణ సవది, మాజీ మంత్రులు, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల కొందరి పేర్లు గల్లంతు కావడం హాట్ టాపిక్ అయ్యింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చారు.

ఇప్పటికే కేఎస్. ఈశ్వరప్ప రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇక మాజీ సీఎం జగదీష్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది బీజేపీ మీద తిరుగుబాటు చేశారు. ఇప్పుడు అదే బాటలో చిత్రదుర్గ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గూలిహట్టి శేఖర్ బీజేపీ మీద తిరుగుబాటు చెయ్యాలని డిసైడ్ అయ్యారు.

2008లో స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన డి. శేఖర్ తరువాత కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి సహకరించి తరువాత మంత్రి అయ్యారు. 2013లో మళ్లీ స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2018లో బీజేపీ టిక్కెట్ సంపాధించిన శేఖర్ తరువాత ఎమ్మెల్యే అయ్యారు.
2023లో కూడా బీజేపీ టిక్కెట్ కావాలని శేఖర్ బీజేపీ హైకమాండ్ కు మనవి చేశారు. అయితే శేఖర్ కు బదులుగా లింగమూర్తికి టిక్కెట్ ఇవ్వడంతో ఆయన రగిలిపోయారు. తనక టిక్కెట్ ఇవ్వడం లేదని తెలుసుకున్న గూలిహట్టి శేఖర్ మంగళవారం రాత్రి బెంగళూరులోని గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి పరుగు తీశారు.
ఎస్సీ వర్గానికి చెందిన గూలిహట్టి శేఖర్ కు హోసదుర్గాలో మంచి పట్టు ఉంది. బీజేపీ టిక్కెట్ మిస్ కావడంతో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చెయ్యాలని శేఖర్ అనుకున్నారు. అయితే మాజీ మంత్రి, కేఆర్ పీ పార్టీ అధ్యక్షుడు గాలి జనార్దన్ రెడ్డితో చాలా ఏళ్ల నుంచి మంచి సంబంధాలు ఉన్న శేఖర్ ఇప్పుడు గాలి గూటికి చేరుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి పార్టీ నుంచి హోసదుర్గా నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని గూలిహట్టి శేఖర్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. మొత్తం మీద బీజేపీ రెబల్స్ చాలా మంది గాలి జనార్దన్ రెడ్డి వైపు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications