క్రెడిట్ కోసం: బిజెపి సవరణలే సీమాంధ్ర మంత్రులచే..!
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, ఆ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని, విభజన జరిగితే ఆ ఘనతను తాను సొంతం చేసుకోవాలనుకుంటోందని లేకపోతే, నెపాన్ని తమపై నెట్టాలని ప్రయత్నిస్తోందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ హరిబాబు ఆధ్వర్యంలో సీమాంధ్ర బిజెపి నాయకులు కృష్ణంరాజు తదితరులు గురువారం రాజ్‌నాథ్‌ను ఆయన నివాసంలో కలిశారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారంటూ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సీమాంధ్ర డిమాండ్లను మరోసారి పార్టీ అధ్యక్షుడికి వినిపించారు. ఈ సందర్భంగా రాజ్ కాంగ్రెసు వైఖరి పైన అనుమానాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

విభజన విషయంలో బిజెపి వైఖరి చాలా స్పష్టంగా ఉందని, పది జిల్లాలతో కూడిన తెలంగాణకు మద్దతు ఇవ్వాలని, సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయాలన్నదే పార్టీ విధాన నిర్ణయమని రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు. సోమ లేదా మంగళవారాల్లో పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ మేరకు మాతో కూడా అనధికారిక చర్చలు జరుగుతున్నాయని, సీమాంధ్రకు న్యాయం అంటే ఏంటి? మీ పార్టీ డిమాండ్లు ఏంటి? అని కూడా అడిగారని సీమాంధ్ర నేతలతో అన్నట్లుగా తెలుస్తోంది.
సీమాంధ్ర రాజధానిని కూడా బిల్లులోనే పేర్కొనాలని, సీమాంధ్రకు ప్రకటించే ఆర్థిక ప్యాకేజీకి ప్రణాళికా సంఘం నుంచి అనుమతి పొందాలని, పదేళ్లపాటు కొత్త రాష్ట్రానికి పన్ను రాయితీలు కల్పించాలని, హైదరాబాద్ ఆదాయ పంపిణీని స్పష్టం చేయాలని, హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న సీమాంధ్ర విద్యార్థులు మరో పదేళ్లపాటు అక్కడ జరిగే అన్ని కాంపిటీటివ్ పరీక్షల్లో పాల్గొనేందుకు వారిని స్థానికులుగా పరిగణించాలని, హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులకు భద్రత కల్పించాలని, పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రకు ఇవ్వాలని, రాయలసీమకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలంటూ పలు డిమాండ్లను చేశామని తెలిపారట.
అలాగే, పార్లమెంటు ఉభయ సభల్లో ఏ ఒక్క ఎంపీని సస్పెండ్ చేసేందుకు అంగీకరించబోమని స్పష్టం చేశామని, ముందుగా, కాంగ్రెస్‌లోని ఇరు ప్రాంత ఎంపీలనూ అదుపులో పెట్టుకోవాలని సూచించామని, వీటిని సానుకూలంగా పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ, ఆ తర్వాత మనం చెప్పిన డిమాండ్లనే సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు జివోఎంకు సమర్పించినట్లు తన దృష్టికి వచ్చిందని, ప్రతి చిన్న విషయంలోనూ తనదే పైచేయి కావాలని, విభజన క్రమంలో వెలువడే ఘనత మొత్తం తనకే దక్కాలన్న ఆరాటం ఆ పార్టీలో కనిపిస్తోందని, ఒక జాతీయ పార్టీ ఇలా ఆలోచించటం దురదృష్టకరమని రాజ్తప్పుబట్టారట.
బిజెపి మాత్రం ఏనాడూ ఘనతల కోసం పాకులాడబోదని, ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన చెప్పారు. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల విషయంలో తాము రాజీ పడబోమని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు తాము ఎంతగా కట్టుబడి ఉన్నామో, సీమాంధ్ర ప్రయోజనాలు నెరవేర్చే విషయంలో కూడా అంతే కట్టుబడి ఉన్నామని సీమాంధ్ర నేతలకు భరోసా ఇచ్చారు. విభజన విషయంలో కాంగ్రెస్ చివరి నిమిషంలో అనధికారికంగా మాట్లాడుతోందే తప్ప అధికారికంగా చర్చలు జరపటం లేదని విమర్శించారు. విభజన విషయంలో తనను కలిసిన కెసిఆర్‌కు పార్టీ వైఖరి స్పష్టంగా చెప్పానని తెలిపారు.












Click it and Unblock the Notifications