అమెరికాలో మోడీ: భారత్‌లో వైఫైపై సుందర్ పిచాయ్
న్యూఢిల్లీ: భారత దేశంలో బహిరంగ వైఫై హాట్ స్పాట్‌లను పెద్ద ఎత్తున విస్తరిస్తామని, రైల్వే స్టేషన్‌లలోను ఏర్పాటు చేస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు చెన్నై సెంట్రల్ స్టేషన్ నుంచి ఐఐటీ ఖరగ్‌పూర్ డేలాంగ్ జర్నీ చేశానని గుర్తు చేసుకున్నారు.
భారత దేశంలోని రైల్వే స్టేషన్లు పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు ఆన్‌లైన్ ఉపయోగించేందుకు సహకరిస్తుందని, ఇందులో తాము భాగస్వాములం అవుతున్నందుకు గర్విస్తున్నానని సుందర్ పిచాయ్ చెప్పారు. గత కొన్నేళ్లుగా, పది కోట్ల మంది భారతీయులు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారన్నారు.
దీనిని బట్టి, ప్రపంచంలోనే ఎక్కువ మంది ఇంటర్నెట్ వినియోగిస్తోంది భారత దేశంలోనే అని అభిప్రాయపడ్డారు. చైనా మినహా ప్రపంచంలో అనేక దేశాల వినియోగదారుల కంటే భారత దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు ఎక్కువ అన్నారు. అయితే, ఇప్పటికీ వంద కోట్ల మంది భారతీయులకు ఆన్ లైన్ గురించి తెలియకపోవడం ఆశ్చర్యకరమన్నారు.
అయితే, వీరికి మా సహకారం ఉంటుందని చెప్పారు. అయితే, పాత కనెక్షన్లతో కాకుండా... ఫాస్ట్ బ్రాడ్‌బాండ్ అనుభవాన్ని వారికి కల్పిస్తామని చెప్పారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా రాక సందర్భంగా... ఆయన తలపెట్టిన డిజిటల్ ఇనిషియేటివ్‌కు సహకారంగా లేక కొనసాగింపుగా... తాము కొత్త ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు. భారత దేశంలో 400 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ పబ్లిక్ వైఫై ప్రాజెక్ట్ చేపడతామన్నారు.
ప్రపంచంలోనే అత్యంత పెద్ద రైల్వే నెట్ వర్క అయిన ఇండియన్ రైల్వేస్‌తో కలిసి పని చేస్తామన్నారు. రైల్ టెల్ సర్వీస్ అందిస్తామన్నారు. మరికొన్ని నెలల్లో కొన్ని స్టేషన్లలో తమ ప్రాజెక్టు చేపడతామన్నారు. అనంతరం దీనిని, రద్దీగా ఉండే వంద స్టేషన్లకు విస్తరిస్తామన్నారు. 2016 చివరికల్లా వీటిని విస్తరిస్తామన్నారు.
ఆ తర్వాత మిగతా స్టేషన్లలోను అంచెలంచెలుగా త్వరితగతిన విస్తరిస్తామని చెప్పారు. వంద స్టేషన్లకు వైఫై ఇవ్వడం ద్వారా... రైళ్లలో రోజూ ప్రయాణిస్తున్న కోటి మందికి ఇది అందుబాటులోకి రానుందన్నారు. భారత్‌లో ఇది అతిపెద్ద వైఫై ప్రాజెక్ట్ అవుతుందని చెప్పారు.

అంతేకాదు, ఓ రకంగా ప్రపంచంలోనే అతిపెద్దది అవుతుందన్నారు. ప్రస్తుతం భారత దేశంలో వినియోగిస్తున్న దానికి ఎన్నోరెట్లు ఫాస్ట్‌గా ఇది ఉండనుందని చెప్పారు. ప్రయాణంలో ఉన్నంత సేపు వారు వీడియోలు చూసుకోవడం, డౌన్ లోడ్ చేసుకోవడం, బుక్స్ చూడటం, కొత్త ఆటలు డౌన్ లోడ్ చేసుకోవడం ఏమైనా చేసుకోవచ్చన్నారు.
ఇంటర్నెట్ వినియోగించాలంటే.. హైక్వాలిటీ స్మార్ట్ ఫోన్ అవసరమని, అందుకే, గత ఏడాది తాము ఆండ్రాయిడ్ లాంచ్ చేశామని చెప్పారు. ఇటీవలే మొబైల్ వెబ్ పేజెస్ లాంచ్ చేశామన్నారు.
భారత దేశంలో ఎక్కువ మందికి ఇంగ్లీష్ కష్టమని, ఈ కారణంగా తాము ఇండియన్ లాంగ్వేజ్ ఇంటర్నెట్ అలయెన్స్ ప్రారంభించామన్నారు. కనెక్టివిటీ ద్వారా భారతీయులందరూ ఫలితం పొందాలని ఆకాంక్షించారు. అదేవిధంగా, ఇంటర్నెట్‌ను మూడో వంతు వినియోగిస్తున్న మహిళల సాధికారత దిశగా ముందుకెళ్తున్నామన్నారు.
కొన్నేళ్ల క్రితం తనలాగా.., ఇప్పుడు ఎంతోమంది భారతీయ యువత చెన్నై సెంట్రల్ స్టేషన్ నుంచి ప్రతిరోజు ప్రయాణిస్తోందని... నేర్చుకునేందుకు, అన్వేషించేందుకు, అవకాశాల కోసం చూస్తోందన్నారు. వీరికి వైఫై ప్రాజెక్టు ఉపకరిస్తుందని సుందర్ పిచాయ్ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications