తక్కువ ధరకే టమోట: రంగంలో దిగిన కేంద్రం
న్యూఢిల్లీ: మార్కెట్‌లో టొమాటో ధర ఆకాశానికి ఎగబాకింది. రోజులు గడుస్తున్నా వాటి రేట్లు నేలకు దిగిరావట్లేదు. ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. టొమాటో.. బంగారం ధరను తలపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కేజీ టొమాటో.. మార్కెట్‌లో 250 నుంచి 300 రూపాయల వరకు పలుకుతోంది.
ఇదే టొమాటో ధర.. గతంలో రైతులను కంటతడి పెట్టించిన ఉదంతాలు లేకపోలేదు. టొమాటో విక్రయాల వల్ల కనీసం ఆటో ఛార్జీలు కూడా దక్కట్లేదనే కారణంతో వాటిని రోడ్ల పక్కన పడేసి వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. చేతికి అందిన పంటను దుక్కి దున్నిన రోజులూ చాలానే ఉన్నాయి. ఇప్పుడు కిలో టొమాటో మీద ఎంత లేదన్నా రైతులు 250 రూపాయల వరకు లాభాలను అందుకుంటోన్నారు.

మార్కెట్లో బౌన్సర్లను పెట్టి టొమాటోలను విక్రయించే పరిస్థితి ఏర్పడిందిప్పుడు. ధర భారీగా పెరిగినందు వల్ల ఏపీ ప్రభుత్వం టొమాటోలపై రాయితీని ప్రకటించింది. రైతుల వద్ద భారీ మొత్తంతో టొమాటోలను కొనుగోలు చేసి, కేజీ 50 రూపాయల చొప్పున రైతు బజార్లల్లో విక్రయిస్తోంది. ఈ పరిణామం అటు రైతులు, ఇటు కొనుగోలుదారులకు ఊరటనిస్తోంది.
ఈ పరిస్థితుల్లో అటు కేంద్ర ప్రభుత్వం కూడా తాజాగా రంగంలోకి దిగింది. తక్కువ రేటుకు టమోటాలను విక్రయించడానికి సన్నాహాలు చేపట్టింది. తక్కువ ధరకు టమోటాలను విక్రయించడానికి దేశవ్యాప్తంగా 500 ప్రాంతాలను ఎంపిక చేసింది. ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. అక్కడ కేజీ టమోటాను 80 రూపాయలకు విక్రయిస్తోంది.
నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా టమోటా విక్రయాలను చేపట్టామని కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి అశ్విని కుమార్ చౌబే తెలిపారు. ఇవ్వాళ్టి నుంచే అమ్మకాలు ఆరంభం అయ్యాయని చెప్పారు.
నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్ ద్వారా ఢిల్లీ, నొయిడా, లక్నో, కాన్పూర్, వారణాసి, పాట్నా, ముజఫర్‌పూర్‌లలో ఇవ్వాళ్టి నుంచి పలు పాయింట్లలో విక్రయాలు ప్రారంభమయ్యాయని ఆహార శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ చెప్పారు. సోమవారం నుంచి మరిన్ని నగరాలకు ఈ సేల్స్ పాయింట్లను విస్తరిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications