అబ్బో పాకిస్తాన్ పై ఎంత ప్రేమో! డ్యామ్ నిర్మాణానికి భారీగా నిధులిస్తున్న చైనా?
మిత్రదేశం పాకిస్తాన్‌కు చైనా మరో వరం ప్రసాదించింది. గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలో సింధు నదిపై పాక్ నిర్మించ తలపెట్టిన ‘దైమెర్-బాషా డ్యామ్’కు నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చింది.
న్యూఢిల్లీ: మిత్రదేశం పాకిస్తాన్‌కు చైనా మరో వరం ప్రసాదించింది. గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలో సింధు నదిపై పాక్ నిర్మించ తలపెట్టిన 'దైమెర్-బాషా డ్యామ్'కు నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చింది.
డ్యామ్ నిర్మాణానికి 14 బిలియన్ డాలర్లు ఖర్చవుతాయని అంచనా. దైమెర్-బాషా డ్యామ్‌ను 2006లోనే పాక్ ప్రకటించింది. 2011లో పునాది రాయి వేశారు. ఈ డ్యామ్ ద్వారా 4,500 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయాలనేది పాక్ ఆలోచన.

అయితే ఈ డ్యామ్ నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)లు నిరాకరించడంతో ఇప్పుడు ఆ పని చేసేందుకు చైనా ముందుకొచ్చింది. ఈ విషయాన్ని పాక్ అధికారిక రేడియో ప్రకటించింది.
చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)లో భాగంగా ఈ డ్యామ్‌ను నిర్మించేందుకు చైనా ముందుకొచ్చినట్టు పాక్ అధికారులను ఉటంకిస్తూ పాక్ రేడియో పేర్కొంది. ఈ డ్యామ్ విషయంలో భారత్ తొలి నుంచి అభ్యంతరాలు చెబుతూనే ఉంది. అయితే భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ డ్యామ్ నిర్మాణానికి చైనా ముందుకు రావడం గమనార్హం.
'దైమెర్-బాషా డ్యామ్' నిర్మించాలనుకుంటున్న ప్రాంతం కశ్మీర్‌లో అంతర్భాగమని భారత్ వాదిస్తోంది. దీనికి తోడు డ్యామ్ నిర్మాణం కోసం భారత్ నుంచి 'నో అబ్జెక్షన్' సర్టిఫికెట్ తేవడంలో పాక్ విఫలమైంది.
నిజానికి ఈ డ్యామ్ నిర్మాణం కోసం నిధులు ఇచ్చేందుకు రెండేళ్ల క్రితమే ప్రపంచ బ్యాంకు నిరాకరించింది. గతేడాది నవంబరులో ఏడీబీ కూడా నిధులకు ససేమిరా అంది. దీంతో డ్యామ్ నిర్మాణం డైలమాలో పడింది.
అయితే తాజాగా పాక్ నెత్తిన చైనా పాలుపోసింది. ప్రస్తుతం నిర్మిస్తున్న సీపీఈసీ ప్రాజెక్టులో భాగంగా ఈ 'దైమెర్-బాషా డ్యామ్' నిర్మాణానికి చైనా ముందుకొచ్చింది. పాకిస్తాన్ కు అండగా నిలబడి డ్యామ్ నిర్మాణంలో పాలుపంచుకోనుంది.












Click it and Unblock the Notifications