బెంగళూరులో భవన నిర్మాణాల ప్లానింగ్ లో భారీ మార్పులు?
Bengaluru rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల బెంగళూరు కుండపోత వర్షాలు పడ్డాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపునీరు పోటెత్తింది. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. బలమైన ఈదురుగాలులకు అనేక చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.
మే నెలలో ఈ స్థాయిలో అతి భారీ వర్షపాతం నమోదు కావడం 10 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. ఈ వర్షాల దెబ్బ ఏ స్థాయిలో ఉందంటే- దేశంలో అతిపెద్ద ఐటీ హబ్ అయిన మాన్యత టెక్ పార్క్ నీట మునిగిపోయింది. 300 ఎకరాల్లో విస్తరించిన టెక్ పార్క్ ఇది. దాదాపుగా అన్ని ఐటీ కంపెనీల కార్యాలయాలు ఇక్కడ తమ కార్యకలాపాలను కొనసాగిస్తోన్నాయి.

ఈ వర్షాల వల్ల బ్రాండ్ బెంగళూరు దెబ్బతిన్నదంటూ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ (సెక్యులర్).. అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడికి దిగాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హయాంలో ఆక్రమణలు విచ్చలవిడిగా చోటు చేసుకున్నాయని, పార్కులు, చెరువులు.. కాలువలను కాంగ్రెస్ నాయకులు ఆక్రమించుకున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.
ఈ పరిస్థితుల మధ్య సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రెండు రోజులుగా బెంగళూరులో విస్తృతంగా పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కలియదిరిగారు. వారిద్దరూ స్వయంగా బస్సులో పర్యటించారు. క్షేత్రస్థాయిలో వరద ప్రభావిత పరిస్థితులను సమీక్షించారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికెలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను కూడా వారిద్దరూ సందర్శించారు.
నేడు కూడా సిద్ధరామయ్య- డీకే శివకుమార్ పర్యటన కొనసాగింది. ఈ మధ్యాహ్నం యలహంక డివిజన్ లో పర్యటించారు. రాజకాలువను సందర్శించారు. ప్రధాన వరద నీటి కాలువ ఇది. వివిధ కాలనీలు, ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న ఫ్లడ్ డ్రైన్లను అనుసంధానిస్తూ ఇది నిర్మితమైంది.
దీన్ని ఆక్రమించుకుని కట్టడాలను నిర్మించడం పట్ల సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని తొలగించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని బీబీఎంపీ అధికారులను ఆదేశించారు. వచ్చే వర్షాకాల సీజన్ నాటికి ఆక్రమణల నుంచి రాజకాలువ విముక్తి కావాలని డెడ్ లైన్ విధించారు.
మాన్యతా టెక్ పార్క్, ఇబ్సు, మాన్ ఫో, కార్లే అనే ప్రైవేట్ బిల్డర్లు రాజకాలువను ఆక్రమించుకున్నారంటూ ఫిర్యాదులు అందినట్లు ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. దీనిపై గ్రీవెన్స్ సెల్ కు అనేక ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. ఎవరు ఆక్రమించినా, ఎంత పెద్ద బిల్డర్లు అయినా, రాజకాలువ ఆక్రమణను ఎటువంటి ఆలస్యం లేకుండా తొలగించాలని సిద్ధరామయ్య స్పష్టంగా ఆదేశించారు.
అదే సమయంలో భారీ అపార్ట్ మెంట్ల సెల్లార్లు, వాటి పార్కింగ్ ప్రదేశాలు మార్పులు చేయాలని సిద్ధరామయ్య అన్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మూడు నెలల్లో సిద్ధం చేయాలని, వాటిని ముఖ్యమంత్రి కార్యాలయానికి అందజేయాలని టౌన్ ప్లానింగ్ విభాగానికి సూచించారు.
అనంతరం ఆయన వడ్డెరపాళ్య లేఔట్, గెద్దలహళ్లిల్లో పర్యటించారు. గెద్దలహళ్లి వద్ద రాజకాలువ విస్తీర్ణ 29 మీటర్లుగా రికార్డుల్లో ఉండగా.. ఇప్పుడది ఎనిమిది మీటర్లకే పరిమితమైందని అధికారులు వివరించారు. బాటిల్ నెక్ కావడం వల్ల రాజకాలువ నుంచి వరద నీరు మొత్తం పొంగి పొర్లుతోందని వివరించారు. ఈ బాటిల్ నెక్ ను విస్తరించాలని సిద్ధరామయ్య ఆదేశించారు.












Click it and Unblock the Notifications