దేశంలో కరోనా ఉధృతి ఏ రేంజ్‌లో ఉందంటే... ప్రతీ నిమిషానికి ఇద్దరి మరణం,ప్రతీ సెకనుకు 4 కొత్త కేసులు
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి పేషెంట్లు పిట్టల్లా రాలిపోతున్నారు. వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటాను పరిశీలిస్తే కరోనా ఉధృతి దేశంలో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ డేటా ప్రకారం... భారత్‌లో సగటున ఒక నిమిషానికి 270 కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అంటే సగటున ఒక సెనుకు నాలుగు కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక మరణాల విషయానికి వస్తే... సగటున ఒక నిమిషానికి ఇద్దరు కరోనాతో మరణిస్తున్నారు.

నెల రోజుల్లోనే 45వేల మరణాలు..
ఏప్రిల్ 1 నుంచి శుక్రవారం(ఏప్రిల్ 30) నాటికి దేశంలో మొత్తం 45,403 మంది కరోనాతో మృతి చెందారు. ఇందులో 27,800 మరణాలు ఏప్రిల్ 21 తర్వాత సంభవించినవే. గడిచిన 24 గంటల్లో కరోనాతో 3498 మంది మరణించగా... ఇందులో కేవలం 10 రాష్ట్రాల్లోనే 77.44శాతం మరణాలు సంభవించాయి.అత్యధికంగా మహారాష్ట్రలో 771 మంది,ఢిల్లీలో 395 మంది కరోనాతో మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం... మహారాష్ట్రలో ప్రతీ గంటకు 32 మంది కరోనా బాధితులు మృతి చెందుతున్నారు. ఢిల్లీలో ప్రతీ గంటకు 16 మంది కరోనా బాధితులు మృతి చెందుతున్నారు.

కొత్త కేసుల్లో ఆ రాష్ట్రాలు టాప్...
ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా 65.41 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 31.46 లక్షల కేసులు చివరి 10 రోజుల్లో నమోదైనవే. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో కేవలం 10 రాష్ట్రాల నుంచే 73.05శాతం కేసులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్ర,ఉత్తరప్రదేశ్,ఢిల్లీ,కర్ణాటక,కేరళ,ఛత్తీస్‌గఢ్,పశ్చిమ బెంగాల్,తమిళనాడు,ఆంధ్రప్రదేశ్,రాజస్తాన్ రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 66,159 కేసులు,కేరళలో 38,607 కేసులు,ఉత్తరప్రదేశ్‌లో 35,104 కేసులు నమోదయ్యాయి.
Recommended Video

మే నెలలో పీక్స్‌కి...
శుక్రవారం(ఏప్రిల్ 30) దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 3,86,452 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులివే. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1.87కోట్లకు చేరింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనాతో 3498 మంది మరణించారు. ఇప్పటివరకూ ఒక్కరోజు వ్యవధిలో నమోదైన అత్యధిక మరణాలు ఇవే కావడం గమనార్హం. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల మరణాల సంఖ్య 2.08లక్షలకు చేరింది. ప్రస్తుతం దేశంలో 31.70 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మే 3-5 తేదీల మధ్య దేశంలో కరోనా కేసుల సంఖ్య పీక్స్‌కి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications