Sunanda Pushkar: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు విముక్తి: ఏడేళ్ల టార్చర్ అంటూ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సునంద పుష్కర్ డెత్ కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం లోక్‌సభ సభ్యుడు శశిథరూర్‌కు ఊరట లభించింది. ఈ కేసు నుంచి ఆయన విముక్తుడయ్యారు. సునంద పుష్కర్ డెత్ కేసుతో శశిథరూర్‌కు సంబంధం లేదంటూ ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. ఆయన పేరును కొట్టివేసింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తీర్పు వినిపించింది. దీనిపై శశిథరూర్ స్పందించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని వ్యాఖ్యానించారు.

2014 నాటి కేసు..
2014లో జనవరి 17వ తేదీన దేశ రాజధానిలోని ఓ లగ్జరీ హోటల్ గదిలో సునంద పుష్కర్ మృతదేహం లభించిన విషయం తెలిసిందే. భర్త శశిథరూర్‌తో కలిసి ఆమె ఈ హోటల్‌లో దిగారు. అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 498 ఎ (భర్త లేదా సంబంధికుల ద్వారా అత్యాచారం), సెక్షన్ 306 (ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పడం) కింద శశిథరూర్‌పై కేసు పెట్టారు.

ఏడున్నర సంవత్సరాల పాటు..
సునంద పుష్కర్ బలవన్మరణానికి పాల్పడేలా శశిథరూర్ ప్రేరేపించి ఉంటారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసు దర్యాప్తు ఏడున్నర సంవత్సరాల పాటు సాగింది. శశిథరూర్ తరఫున సీనియర్ అడ్వొకేట్ వికాస్ పహ్వా వాదనలను వినిపించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాత్సవ వాదనల్లో పాల్గొన్నారు. కిందటి నెల 27వ తేదీన చివరిసారిగా ఢిల్లీలోని రోజ్ అవెన్యూ న్యాయస్థానం విచారణ చేపట్టింది. కొన్ని డాక్యుమెంట్లను అందజేయాల్సి ఉన్నందున శశిథరూర్.. వాయిదా కోరారు. దీనితో ఇవ్వాళ్టికి కేసు వాయిదా పడింది.

పేరు కొట్టివేస్తూ..
ఈ ఉదయం కేసు విచారణను చేపట్టిన రోజ్ అవెన్యూ న్యాయస్థానం.. తన తుది తీర్పును వినిపించింది. సునంద పుష్కర్ డెత్ కేసులో శశిథరూర్ ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాలేవీ లేనందున.. ఆయన పేరును కొట్టివేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది ఢిల్లీ న్యాయస్థానం. తీర్పు వెలువడిన వెంటనే శశిథరూర్ స్పందించారు. తీర్పును స్వాగతిస్తున్నానని అన్నారు. ఏడున్నర సంవత్సరాల మానసికంగా చిత్రవధ అనుభవించానని, ఇప్పుడు ఊరట లభించిందని వ్యాఖ్యానించారు.

కేరళ నుంచి తిరుగులేని నేతగా..
శశిథరూర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోన్నారు. ఆయన స్వరాష్ట్రం కేరళ. 2019 నాటి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తిరువనంతపురం స్థానం నుంచి పోటీ చేశారు. ఘన విజయాన్ని సాధించారు. తన సమీప ప్రత్యర్థి, భారతీయ జనతా పార్టీకి చెందిన కుమ్మనం రాజశేఖరన్‌పై సుమారు లక్ష ఓట్ల తేడాతో గెలుపొందారు. తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి శశిథరూర్ గెలవడం వరుసగా ఇది మూడోసారి. 2009, 2014 ఎన్నికల్లో వరుస విజయాలను సాధించారు.

ఏఐసీసీలో అసంతృప్త నేతగా
కాగా- ప్రస్తుతం ఆయన సోనియాగాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తోన్న వారిలో ఉన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాసిన సీనియర్ నేతలు కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, గులాం నబీ ఆజాద్‌ల జాబితాలో శశిథరూర్ కూడా ఉన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సారథ్య బాధ్యతలను తీసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్న గాంధీయేతర కుటుంబానికి చెందిన నాయకుడిగా శశిథరూర్‌కు గుర్తింపు ఉంది. ఆయనకు ఏఐసీసీ అధ్యక్ష పగ్గాలను అప్పగిస్తారనే ప్రచారం మొదట్లో విస్తృతంగా సాగింది. అది వాస్తవ రూపం దాల్చలేదు.












Click it and Unblock the Notifications