అల్పపీడనం: వర్షాలతో తమిళనాడులో 3గురు మృతి
హైదరాబాద్: కేరళ తీరం వద్ద ఏర్పడిన అల్ప పీడన ద్రోణి ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వర్షం ప్రారంభమైంది. కేరళ తీరం వద్ద ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు గురువారం వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అల్పపీడనం, దానికి తోడు ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా ఓ చిన్నారితో పాటు ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. శుక్రవారం గోవా వద్ద వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నట్లు సమాచారం.

దక్షిణ తమిళనాడుకు దిగువన కామరూన్ పరిసరాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని నుంచి తమిళనాడు, కర్ణాటకల మీదుగా మధ్యప్రదేశ్ వరకూ ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో భారీగా తేమగాలులు ఉత్తర దిశగా వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని ర్రాష్టంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది.
రానున్న 24 గంటల్లో రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, కర్నూలు, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌లలో అక్కడక్కడా భారీగా, మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నెల తొమ్మిది నుంచి ఉత్తర కోస్తా, తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, ఖమ్మం, నల్లగొండల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications