నా చరిత్రకాదు..చరిత్ర సృష్టించిన వారివి చెప్పండి: మోడీ
న్యూఢిల్లీ: పాఠ్యపుస్తకాలలో తన గురించి కాదని, చరిత్ర సృష్టించిన వారెందరో ఉన్నారని, వారి గురించి విద్యార్థులకు చెప్పాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం సూచించారు. చాలాకాలంగా ఎంతోమంది చరిత్ర సృష్టించారని, వారి గురించి పిల్లలు చదవడం చాలా ఉపయోగకరమన్నారు.
పాఠ్య పుస్తకాల్లో మోడీ విజయగాథను పెట్టాలని గుజరాత్ విద్యా శాఖ నిర్ణయించింది. సోషల్ సైన్స్ పుస్తకంలో ఐదో తరగతి నుండి ఏడో తరగతి వరకు మోడీ చరిత్రను 2015 విద్యా సంవత్సరం నుండి పెట్టాలని భావించింది.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే భావించింది. విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో మోడీ చరిత్ర పెట్టాలని శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం భావిస్తోంది. మోడీ చాయ్ వాలా నుండి ప్రధానిగా ఎదిగినందున.. ఆయన చరిత్రను పుస్తకాలలో పెడితే విద్యార్థులకు స్ఫూర్తిగా ఉంటుందని భావిస్తోంది.
గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వం ఉంది. తన విజయగాథను పాఠ్య పుస్తకాలలో పెట్టాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నందున మోడీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. భారత దేశానికి ఎంతో ఘన చరిత్ర ఉందని, గొప్ప పోరాట యోధులు, చారిత్రక పురుషులు ఉన్నారని, వారి ద్వారానే నేటి భారత్ తయారయిందని, విద్యార్థులు, పిల్లలు వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరముందని ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications