Bihar Election 2025: బీహార్ ఓటర్లకు భారీ ఊరట..! విమర్శలతో వెనక్కి తగ్గిన ఈసీ..!
బీహార్ లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తీసుకొస్తున్న నిబంధనలతో ఓటర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇంకా చెప్పాలంటే దాదాపు 2 కోట్లకు పైగా ఓటర్లు పోలింగ్ కు దూరమయ్యే ప్రమాదం ఎదురైంది. దీంతో విపక్షాలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఈసీ తీరుపై మండిపడుతున్నారు. ముఖ్యంగా ఓటరు గుర్తింపు కోసం ఆధార్ కార్డు కాకుండా ఇతర డాక్యుమెంట్లు సమర్పించాలంటూ ఈసీ పెట్టిన నిబంధనే ఇందుకు కారణమైంది.
ఈ నేపథ్యంలో ముప్పేట దాడితో ఎన్నికల సంఘం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఓట్ల కోసం ప్రస్తుతానికి దరఖాస్తులు సమర్పిస్తే సరిపోతుందని, ఓటు హక్కు కోసం అవసరమైన పత్రాలను తర్వాత సమర్పించవచ్చని సూచించింది. రాష్ట్రంలో బూత్ స్థాయి అధికారులు పూరించిన, సంతకం చేసిన అన్ని ఫారాలను అప్‌లోడ్ చేయాలని, పత్రాలను తరువాత సమర్పించవచ్చని బీహార్ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది.

ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డుల కోసం అవసరమైన ఫారాల్ని సాధ్యమైనంత త్వరగా బీఎల్వోలకు పంపాలని ఎన్నికల అధికారి సూచించారు. ఓటర్లు తమ వద్ద అవసరమైన పత్రాలు లేకపోతే, నింపిన, సంతకం చేసిన ఫారాలను బీఎల్వీలకు పంపాలని కోరారు. ఎన్నికల సంఘం ఎటువంటి కొత్త ఉత్తర్వులు జారీ చేయనప్పటికీ, తుది ఫారమ్ సమర్పణకు గడువు కేవలం రెండు వారాల్లో ముగియనుంది. దీంతో బీహార్ సీఈవో జోక్యం చేసుకుని ఓటర్లలో భయాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే కలెక్టర్లకు కూడా ఈ మేరకు ఎన్నికల అధికారి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఓటర్ల నుంచి అవసరమైన పత్రాలు లేకుండానే ఫారమ్‌లను తీసుకోవాలని ఆదేశించారు. ఓట్ల కోసం సాధ్యమైనన్ని ఎక్కువ దరఖాస్తు పత్రాల్ని తీసుకోవాలని కోరారు. తద్వారా గరిష్ట సంఖ్యలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించవచ్చని తెలిపారు. బీఎల్వో డాష్‌బోర్డ్ ద్వారా వీటిని అప్‌లోడ్ చేయవచ్చని తెలిపారు.












Click it and Unblock the Notifications