మరోసారి పాక్ దొంగ దెబ్బ: భారత జవాను మృతి, కొనసాగుతున్న కాల్పులు
శ్రీనగర్: యూరీ దాడి తరహాలో జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి సైనికులపై దాడికి తెగబడ్డారు. బారాముల్లా శివారుల్లో ఉన్న 46 రాష్ట్రీయ రైఫిల్స్ శిబిరంపై ఆదివారం రాత్రి 10.30కు ఆత్మాహుతి దళం దాడికి దిగింది. ఉభయపక్షాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ శిబిరంలో సైన్యంతో పాటు సరిహద్దు భద్రతా దళాని(బీఎస్‌ఎఫ్)కి చెందిన సిబ్బంది కూడా ఉన్నారు.
దాడిలో ఓ బీఎస్‌ఎఫ్ జవాన్ ఒకరు మృతి చెందారు. మరొకరు గాయపడినట్లు సమాచారం. భారత సైన్యం కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు.
కాగా, శిబిరానికి దగ్గర్లో ఉన్న పార్కు ద్వారా ముగ్గురు నుంచి నలుగురు ముష్కరులు సైనిక శిబిరంలోకి గ్రనేడ్లు విసురుతూ చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించారని, అయితే సైనికులు వారిని నిలువరించారని తెలుస్తోంది.
ఉభయ పక్షాల మధ్య భారీ ఎత్తున కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. శిబిరానికి దగ్గర్లో ఉన్న ఇళ్లలోంచి ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

యూరీలో సైనిక శిబిరంపై పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు దాడికి దిగిన పదిహేను రోజులకే మళ్లీ దాడి జరగడం గమనార్హం. యూరీ దాడికి ప్రతీకారంగా బుధవారం అర్ధరాత్రి భారత సైన్యం నియంత్రణ రేఖకు ఆవల మెరుపుదాడికి పాల్పడి 40 మంది పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.
మళ్లీ ఉల్లంఘన:
మరోవైపు పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి మళ్లీ తూట్లు పొడిచింది. జమ్మూ జిల్లాలోని పల్లన్‌వాలా సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఆ దేశ బలగాలు ఆదివారం కాల్పులకు తెగబడ్డాయి. ధర్ చన్ని, సంవాన్, చప్రియాల్ ప్రాంతాల్లో రెండు గంటలకు పైగా కాల్పులు కొనసాగాయి.
పాక్ కాల్పులను భారత్ బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఘటనలో ఎవరైనా మృతిచెందారా?లేదా అనే విషయాలు తెలియరాలేదు. పీవోకేలో ఉగ్రస్థావరాలపై భారత బలగాల మెరుపుదాడుల అనంతరం పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటం ఇది ఆరోసారి. కాగా, సరిహద్దులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు పాకిస్థాన్ జాతీయులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.












Click it and Unblock the Notifications