హస్తానికి షాక్: ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక.. దినేశ్ మోంగియా కూడా
పంజాబ్ పోరు ఆసక్తికరంగా మారనుంది. ఒమిక్రాన్ హడలెత్తించడంతో ఎన్నికలు ఎప్పుడూ జరుగుతాయనే అంశంపై స్పష్టత లేదు. వచ్చే ఏడాదిలో మాత్రం ఎన్నిక జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ప్రధాన పార్టీలు తమ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే చేరికలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్, ఆప్ హవా కొనసాగింది. కానీ అనూహ్యంగా బీజేపీలో భారీగానే చేరికలు ఉంటున్నాయి.

కాంగ్రెస్‌కు షాక్
పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. అదీ కూడా బీజేపీలో చేరారు. ఫతేజంగ్ సింగ్ బాజ్వా, బల్విందర్ సింగ్ లాడీ ఇద్దరు కలిసి హస్తానికి హ్యాండ్ ఇచ్చారు. గురుదాస్ పూర్ జిల్లా ఖదియాన్, శ్రీ హర్గొబింద్ పూర్ నియోజకవర్గాల నుంచి వీరిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదివరకు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాణా గుర్మిత్ సింగ్ సోది కూడా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

మోంగియా కూడా
పంజాబ్ బీజేపీ ఇంచార్జీ గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ రాజ్‌దేవ్ సింగ్ ఖాస్లా, మాజీ ఎమ్మెల్యే గుర్జిత్ సింగ్ చేరారు. అలాగే క్రికెటర్ దినేశ్ మోంగియా కూడా వీరితో బీజేపీలో చేరారు. బాజ్వా.. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ప్రతాప్ సింగ్ బాజ్వా సోదరుడు. అయితే పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్దూతో బాజ్వాకు చెడిందని సమాచారం. అందుకోసమే పార్టీ మారారని విశ్వసనీయ సమాచారం.

ఇదీ నేపథ్యం..
ఖాస్తా 1989లో ఎంపీగా ఎన్నికయ్యారు. అకాళిదల్ పాంతిక్ నుంచి పోటీ చేసి.. మాజీ ఎంపీ సిమ్‌రంజిత్ సింగ్ మాన్‌ను ఓడించారు. గుర్‌తేజ్ సింగ్ 1997, 2007, 2012లో ఎమ్మెల్యేగా గెలిచారు. రాజ్‌దేవ్ సింగ్ ఖాస్లా ఇదివరకు రాష్ట్రీయ సిక్ సంగట్‌లో పనిచేశారు.

రైతు సంఘం నేతలు
ఇటు రైతు సంఘం కూడా పంజాబ్ ఎన్నికల బరిలోకి దిగుతుంది. పంజాబ్‌లో 32 రైతు సంఘాలు ఉండగా.. 22 సంఘాలు ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించాయి. ఈ సంస్థలు పంజాబ్ సంయుక్త సమాజ్ మోర్చా పేరుతో పార్టీని కూడా ప్రకటించాయి. రైతుల పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లోని మొత్తం 117 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. బల్బీర్ సింగ్ రాజేవాల్ రైతుల ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications