బీజేపీ డిప్యూటీ సీఎంకు కాంగ్రెస్ టికెట్
బెంగళూరు: పొరుగునే ఉన్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నాయి. బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తోన్నారు. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గేకు ఇది సొంత రాష్ట్రం. ఫలితంగా ఈ ఎన్నికలను అటు కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మంగా తీసుకుంది. కాంగ్రెస్ మాజీ అధినేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు సీనియర్ నేతలు కర్ణాటకలో మకం వేయడానికి సన్నద్ధమౌతోన్నారు.

ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్.. బస్సు యాత్ర ద్వారా రాష్ట్రం మొత్తాన్నీ చుట్టేస్తోన్నారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్.. అభ్యర్థుల జాబితాను ఒక్కటొక్కటిగా విడుదల చేస్తోన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇదివరకే రెండు విడతల్లో ఈ జాబితాను విడుదల చేసింది. కొద్దిసేపటి కిందటే మూడో విడత లిస్ట్‌ను రిలీజ్ చేసింది. 43 మందితో కూడిన జాబితా ఇది.
మొన్నటివరకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలిగిన లక్ష్మన సవాదికి బీజేపీ టికెట్ దక్కలేదు. దీనితో ఆయన తన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, అసంతృప్తిని వ్యక్తం చేశారు. బీజేపీ అధిష్ఠానం పెద్దగా స్పందించకపోవడంతో పార్టీకి గుడ్‌బై చెప్పారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆయనకు కాంగ్రెస్ టికెట్ లభించింది. బెళగావి జిల్లాలోని అథణి నియోజకవర్గం నుంచి లక్ష్మణ సవాదిని ఎన్నికల బరిలోకి దింపింది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి నియోజకవర్గం ఇది. లక్ష్మణ సవాది సొంత నియోజకవర్గం కూడా ఇదే. బీజేపీ అభ్యర్థిగా ఆయన కాంగ్రెస్ చేతిలో ఓటమి చవి చూశారు. ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి లక్ష్మణ సవాదిని బరిలో దింపడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కోలార్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కొత్తూర్ జీ మంజునాథ్‌కు కేటాయించింది. బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప సొంత నియోజకవర్గం శికారిపుర నుంచి జీబీ మాలతేష్‌ను ఎన్నికల రేసులో నిలిపింది. తెలుగు ప్రజలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండే సింధనూరు నుంచి హంపన్ గౌడ బాదర్లి, బెంగళూరు సిటీ పరిధిలోని చిక్‌పేట నుంచి ఆర్వీ దేవరాజును ఎన్నికల బరిలో నిలిపింది కాంగ్రెస్.












Click it and Unblock the Notifications